భక్తుల ఆగ్రహంతో దిగొచ్చిన టీటీడీ

భక్తుల ఆగ్రహంతో దిగొచ్చిన టీటీడీ

భక్తుల ఆగ్రహంతో టీటీడీ దిగొచ్చింది.. వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు సిద్ధమవుతోంది.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నిర్ణయాన్ని అమలు చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు.. మంగళవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గురువారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పుడు అమలవుతోన్న ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనం విధానాన్ని రద్దు చేసి... 2012 కంటే ముందున్న విధానాన్ని అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా భక్తులను కులశేఖర పడి వరకు అనుమతిస్తారు. పాత విధానాన్ని అమలు చేయడం ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం సమయాన్ని రెండు గంటలకు పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మిగిలిన గంటను సామాన్య భక్తుల దర్శనానికి కేటాయించవచ్చని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.

తిరుమల ఆలయంలో వీఐపీ ట్రీట్‌మెంట్‌పై ఎప్పట్నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొంతమంది భక్తులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని న్యాయస్థానం టీటీడీ అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను కోర్టు ఆదేశించింది. బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ ప్రకటన చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రకటనను లెక్కలోకి తీసుకోలేమన్న హైకోర్ట్‌.. రద్దు చేస్తున్నట్లు జీవో, ఆర్డర్ ఉంటే కోర్టు ముందు ఉంచాలని తెలిపింది.

మరోవైపు.. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణమని ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. భగవంతుడి ముందు అందరూ సమానమంటూ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయిలో పాలకమండలి ఏర్పాటైన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలని తొలుత భావించినా.. న్యాయ వివాదాలు, భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story