ముగ్గురు ఎమ్మార్వోలు, 11 మంది వీఆర్వోలపై వేటు

ముగ్గురు ఎమ్మార్వోలు, 11 మంది వీఆర్వోలపై వేటు

కలెక్టర్‌ దూకుడు సూర్యాపేట జిల్లాలో అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులే టార్గెట్‌గా చర్యలకు సిద్ధమవుతుండటంతో మిగిలిన వారి వెన్నులో వణుకు పుడుతోంది.. రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై మేళ్లచెర్వు, చింతలపాలెం ఎమ్మార్వోలపై వేటు వేశారు జిల్లా కలెక్టర్‌.

సూర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లపై వేటు పడింది. హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల తహసీల్దార్లను కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరు కావడం వంటి కారణాలతో సస్పెండ్‌ చేస్తున్నట్టు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్టవ్య్రాప్తంగా రెవెన్యూ శాఖ అధికారులపై కొద్దిరోజులుగా విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో రైతుల భూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఏళ్ల తరబడి భూ పట్టాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనలు వరసగా జిల్లాలో వెలుగు చూడటంతో రంగంలోకి దిగిన కలెక్టర్ రైతులతో ముఖాముఖి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా మండల కేంద్రాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ తానే స్వయంగా హాజరవుతూ రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రెవెన్యూ సిబ్బంది పనితీరుపైనా ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు.. ఆరోపణలు వస్తున్న , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.. ఎన్నిసార్లు గట్టిగా మందలించినా తీరు మార్చుకోకపోవడంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.. మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల తహశీల్దార్లు డి.శంకరయ్య, బాబాషర్ఫుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య 14కు చేరింది.. వీరిలో ముగ్గురు ఎమ్మార్వోలు, 11 మంది వీఆర్వోలు ఉన్నారు.

ఈ రెండు మండలాల్లో భూ సమస్యల పరిష్కారంలో తహశీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతులు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టారు. కార్యాలయాల ముందు ధర్నా చేయడంతో పాటు తాళం వేసి నిరసనలు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో వారి పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్ విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు గుర్తించి వేటు వేశారు. కలెక్టర్‌ చర్యలతో జిల్లాలో రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

Tags

Next Story