అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సమాచార లోపంతోనే అధికారపక్ష సభ్యులు దూకుడుగా వెళ్తున్నారన్న చంద్రబాబు.. ప్రతి అంశంలోనూ ఎదురుదాడి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.. హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు సూచనలు చేశారు.

ఆ తర్వాత టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక టీడీపీని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పోలవరం పనులు టీడీపీ 5 ఏళ్లలోనే 66 శాతం పూర్తిచేసిందని కానీ వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తేలేక వైసీపీ ఎదురుదాడి అస్త్రాన్ని ఎంచుకుందని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ అసమర్ధత చూసే సైట్ నుంచి మెషీనరీని అంతా తరలించేశారని, లక్షలాదిమంది కూలీలు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో 26 ఎంక్వైరీలు వేసినా ఏదీ రుజువు చేయలేక పోయారని ఇప్పుడు మళ్లీ చేస్తున్న విచారణలు కూడా అలాగే ఉంటాయని అన్నారు. మంత్రివర్గ ఉప సంఘాలు, సభా సంఘాలు, జ్యుడీషియరీ కమిటీలు వేసినా ఏమీ తేలలేదని గుర్తు చేశారు. వాళ్లు వేసిన కేసులలో జడ్జిల వ్యాఖ్యలే అందుకు రుజువువన్నారు. రాజకీయ కక్షసాధింపునకు కోర్టులను వేదికగా చేసుకున్నారని అక్షింతలు వేశారని గుర్తు చేసారు. ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని అన్నారు.

ఎంక్వైరీలతో కాలం గడిపేయాలని జగన్ చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం ఇప్పటికే అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని అప్రతిష్ట పాలుచేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా అభివృద్ధి ప్రణాళికపై దృష్టి పెట్టాలని అన్నారు. కియా వైఎస్ఆర్‌ తెచ్చారని బుగ్గన చెప్పడం బూమరాంగ్ అయ్యిందన్నారు. కియా వైఎస్ తెచ్చారని చెప్పడం వైసీపీ అబద్ధాలకు పరాకాష్ట అన్నారు చంద్రబాబు.

Tags

Next Story