తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఏమీ లేదు - టీఆర్‌ఎస్ ఎంపీ

తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఏమీ లేదు - టీఆర్‌ఎస్ ఎంపీ

విభజన హామీలు.. బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. లోక్‌సభలో కేంద్రం తీరుపై ఏపీ, తెలంగాణ ఎంపీలు మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులకు పలు హామీలు ఇచ్చిన కేంద్రం.. బడ్జెట్‌ కేటాయింపుల్లో అస్సలు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇటు రాజ్యసభలో విభజన హామీలు అమలు చేయడం లేదని టిఆర్‌ఎస్‌ ఎంపీ కేకే నిలదీశారు. విభజన హామీలకు కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ హామీ ఇచ్చారు.

రాజ్యసభలో విభజన హామీలపై కేంద్రాన్ని తెలుగు ఎంపీలు నిలదీశారు. తెలంగాణకు ఇప్పటి వరకు కేంద్రం చేసింది ఏమీ లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే నిలదీశారు. ట్రిపుల్‌ ఐటీ, ట్రైబల్‌ యూనివర్శిటీ తదితర ఇనిస్టిట్యూలు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం.. అసలు నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విభజన హామీలకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఎంపీ జీవిఎల్‌. అభివృద్ధికి దోహదపడే జాతీయ విద్యాసంస్థల్ని ఒకే ప్రాంతానికి పరిమితం చేయొద్దన్నారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. ఏపీలో 10 జాతీయ విద్యాసంస్థల్ని పదేళ్లలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విభజన చట్టంలో ఉందన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఐఐటీ తరగతులు ప్రారంభించామని గుర్తు చేశారాయన. అయితే.. రాష్ట్రానికి కేటాయించే పది జాతీయ సంస్థలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు జీవీఎల్.

అటు లోక్‌సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు సైతం విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. అరకొర నిధులతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామని నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌పై వ్యవసాయ కేటాయింపులపై జరిగిన చర్చలో కేంద్రం తీరును తప్పుపట్టారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. అతి తక్కువ కేటాయింపులతో సరిపెట్టుకుందని విమర్శించారు. 2014, 2019 బీజేపీ మేనిఫెస్టోలు దేశంలో అత్యంత అసత్యాలు ప్రచురించిన పుస్తకాలుగా గుర్తింపు పొందాయని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ ఎంపీలు విభజన సమస్యలపై పదే పదే ప్రశ్నిస్తున్నా.. కేంద్రమంత్రులు మాత్రం స్పష్టమైన ప్రకటనలు చేయడం లేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మాత్రం విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని రాజ్యసభలో ప్రకటించారు. వాస్తవంగా మాత్రం నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story