కష్టాలకు ఓర్చి.. ట్రిపుల్‌ ఐటీలో చదివి .. గూగుల్‌లో లక్ష డాలర్ల జీతంతో..

కష్టాలకు ఓర్చి.. ట్రిపుల్‌ ఐటీలో చదివి .. గూగుల్‌లో లక్ష డాలర్ల జీతంతో..

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మారుమూల గ్రామంలో పుట్టి, ట్రిపుల్‌ఐటీలో చదువుకుని ఇప్పుడు గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో లక్ష డాలర్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడో తెలుగు విద్యార్థి. మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన కుంటముక్కల శివరామకృష్ణ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయన శివరామకృష్ణను వెల్వడానికి చెందిన లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు విద్యలో ప్రోత్సహించారు

వెల్వడంలోని లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి చదివిన శివ 564 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత నూజివీడులోని ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు. ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదివి 9.27 గ్రేడ్‌ పాయింట్లతో 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. బీటెక్‌తో పాటు సీఎస్‌ఈ విభాగంలో మైనర్‌ డిగ్రీ చేసి పైథాన్‌ అనే ప్రోగ్రామింగ్‌ భాష, కోడింగ్‌ నేర్చుకున్నాడు. అల్గోరిథమ్స్‌, రోబోటిక్స్‌ ,డేటా బేస్‌, డేటా స్ట్రక్చర్‌, మేనేజ్‌మెంట్‌ సిస్టంలో పట్టు సాధించాడు. అనంతరం క్యాంపస్‌ ఇంటర్యూలలో ఎంపికై టీసీఎస్‌లో ఉద్యోగం పొందాడు. ఆ సంస్ధలో రెండున్నరేళ్ల పాటు పనిచేశాడు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో గల కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయంతో( సీఎంయూ) టీసీఎస్‌కు అవగాహన ఒప్పందం ఉంది. దీంతో శివ టీసీఎస్‌ ప్రోత్సాహంతో సీఎంయూలో 2019లో ఎంఎస్‌ చేశాడు. 2019లో 3.6/4 గ్రేడ్‌ మార్కులతో పట్టా అందుకున్నాడు. అతని ప్రతిభ గుర్తించిన గూగుల్‌ లక్ష డాలర్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. నూజివీడు ట్రిపుల్‌ఐటీ పూర్వ విద్యార్థిగా ఈ ఘనత సాధించడంతో శివరామకృష్ణను సంస్థ డైరెక్టర్‌ ఆచార్య డి. సూర్యచంద్రరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అతనిని అభినందించారు.

Tags

Next Story