ఆ జిల్లాలో వాలంటీర్ల నియామకాల్లో కనిపించని పారదర్శకత
ప్రతీ ఊళ్లో ఓ గ్రామ సచివాలయం. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీర్చడమే గ్రామ వాలంటీర్ల బాధ్యత. ప్రజల కష్టాలు తీర్చాలన్న సదుద్దేశంతో ఏపీ సర్కార్ చేపడుతున్న కార్యక్రమం ఇది. వాలంటీర్ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆన్‌లైన్ లోనే దరఖాస్తులు తీసుకుంటున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలి. కానీ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న వాలంటీర్ల నియామకాల్లో పారదర్శకత భూతద్దం పెట్టి వెతికినా కనిపించదనే విమర్శలు ఉన్నాయి. ఈ నెల 11 నుంచి 25 వరకు గ్రామ వాలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా 14 వేల మందిని ఎంపిక చేయాలి. అయితే కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, లేదా ఓటమిపాలైన అభ్యర్థుల సిఫార్సు లేఖలుంటేనే జాబ్ వచ్చేలా కనిపిస్తోంది. దీంతో సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు క్యూ కడుతున్నారు అభ్యర్థులు.
నిరుద్యోగుల అవసరాన్ని... ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు స్థానిక నేతలు. ఫ్యూచర్ ఆలోచిస్తూ... ఇంటివద్దే ఉండి జాబ్ చేసుకోవచ్చని... నేతలు అడిగినంత మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు నిరుద్యోగులు. ఒక్కో పోస్టుకు 5 నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు రూపొందించిన జాబితానే ఫైనల్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటర్వ్యూ బాగా చేసినా అడిగినంతా ఇచ్చుకోలేక ఉద్యోగం వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు.
నియామకాల్లో అవినీతి గురించి ఎమ్మెల్యేలకు తెలిసినప్పటికీ, తినేదీ మనవాళ్లే కదా అని లైట్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక నేతలు సూచించిన వారికే సిఫార్సు లేఖలు ఇస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అలాంటిదేమి లేదని సింపుల్‌గా తేల్చిపారేస్తున్నారు.
వాలంటీర్ల నియామకాల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై అధికార YCP నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నట్టు సమాచారం. రిక్రూట్‌మెంట్ స్టేజ్‌లోనే అవినీతి జరిగితే... ప్రజలకు ఆశించినస్థాయిలో న్యాయం జరగకపోగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని కొందరు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com