తెలంగాణలో కొత్త మున్సిప‌ల్ చట్టం అమలు దిశగా అడుగులు

తెలంగాణలో కొత్త మున్సిప‌ల్ చట్టం అమలు దిశగా అడుగులు

గురువారం నుంచి రెండ్రోజలుపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త పురపాలక బిల్లు ఆమోదం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఈరోజు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రేపు మండలిలో ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్ష పార్టీలు అస్త్రశాస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.

తెలంగాణలో కొత్త మున్సిప‌ల్ చట్టం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అవినీతి నిర్మూల‌న, ప్రజా స‌మ‌స్యలు స‌త్వర ప‌రిష్కార‌మయ్యేలా కొత్త అర్బన్ పాల‌సీని ప్రభుత్వం రూపొందించింది. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో రూపొందించిన నూతన బిల్లు నేడు (గురువారం ) అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు నేడు, రేపు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

ఇప్పటికే ఈ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై అధ్యయనానికి ఒకరోజు సమయం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందుతుంది. అనంతరం మండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందిన తరువాత కొత్త మున్సిపల్ చట్టం అమలులోకి వస్తుంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందే కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనుంది ప్రభుత్వం. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు సహా ఎలాంటి ప్రొసీడింగ్స్‌ ఉండవని ఇప్పటికే సీఎంవో స్పష్టం చేసింది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పరిశీలించారు. సమావేశాలు సజావుగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు శాసనసభ పరిసరాల్లో వాహనదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story