మా హయాంలో 71శాతం పోలవరం పనులు పూర్తిచేశాం : ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

మా హయాంలో 71శాతం పోలవరం పనులు పూర్తిచేశాం : ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

పోలవరం ప్రాజెక్టు పనుల అంశం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళానికి దారితీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా పోలవరంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల జీవనాడియైన పోలవరం పనులు ప్రభుత్వం ఆపివేసిందంటూ టీడీపీ సభ్యులు విమర్శించారు. ప్రాజెక్టుపై ఐదేళ్లపాటు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి అనిల్‌కుమార్‌ ఆరోపించారు. దీంతో సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం మొదలైంది..

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్టా, గోదావరిలో నీటి లభ్యత పడిపోతుందని.. ఈనేపథ్యంలో పోలవరం పనులను త్వరిగతంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. తమ పాలనలో 71శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు..

పోలవరంపై నిపుణుల కమిటీ స్టడీ చేస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. నాలుగు నెలలుగా పనులు ఆగిపోయాయని.. వాటిని నవంబర్‌లో ప్రారంభిస్తామని శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. 2021 నాటికి నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తొలిసారిగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని చెప్పారు జగన్‌..

ముఖ్యమంత్రి సమాధానంపై సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు పూర్తిస్థాయిలో చర్చకు పట్టుపట్టారు. ఏపీ హక్కులను జగన్‌ ప్రభుత్వం తెలంగాణకు తాకట్టుపెట్టిందంటూ సభలో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు స్పీకర్.

Tags

Next Story