ఒడిలో ప్రాణంలేని బిడ్డ.. అంత్యక్రియలకు డబ్బుల్లేక అమ్మ బొమ్మలమ్ముతూ..

ఒడిలో ప్రాణంలేని బిడ్డ.. అంత్యక్రియలకు డబ్బుల్లేక అమ్మ బొమ్మలమ్ముతూ..
X

ఏడవడానికి కూడా కన్నీళ్లు రావట్లేదు. పాలింకి పోయినట్లు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ అమ్మకళ్లలో. బిడ్డ అంత్యక్రియలు చేయడానిక్కూడా డబ్బుల్లేక అమ్మ బొమ్మలమ్ముతోంది. వచ్చే ఆ పదో పరకతోనే ఆకలితో ఆలమటిస్తున్న మిగిలిన ఇద్దరు బిడ్డల కడుపు నింపాలి.. తాగడానికి పాలు లేక తనువు చాలించిన ఒడిలోని బిడ్డకు అంత్యక్రియలు జరపాలి. ఒడిశాలోని కటక్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కలచి వేసింది. బక్షి బజార్‌కు చెందిన భారతికి ముగ్గురు కుమార్తెలు. భర్త సుభాష్ నాయక్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భారతి రోడ్డు పక్కన బొమ్మలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ముగ్గురు పిల్లలు ఐదేళ్ల లోపు వయసు ఉన్నవారు. ఏడాది వయసున్న చిన్న కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి డబ్బుల్లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక చిన్నారి కన్ను మూసింది. అంత్యక్రియలు జరిపించేందుకు డబ్బుల్లేకపోవడంతో అలానే ఒడిలో పెట్టుకుని బొమ్మలు విక్రయించింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి చలించి పోయారు. ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు శిశువుని అమ్మ ఒడి నుంచి వేరు చేసి అంత్యక్రియలు జరిపించారు. మిగిలిన ఇద్దరు చిన్నారులను బసుంధర ఆశ్రమానికి తరలించారు.

Tags

Next Story