సభ నిర్వహణ తీరునకు నిరసనగా కాంగ్రెస్‌ వాకౌట్‌

సభ నిర్వహణ తీరునకు నిరసనగా కాంగ్రెస్‌ వాకౌట్‌

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. తొలి రోజు పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న మున్సిపాలిటీస్ 2019 యాక్ట్‌ ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మున్సిపాలిటి బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల ఫిరాయింపులపై అధికార, విపక్షం మధ్య చర్చ మాటల యుద్ధానికి దారితీసింది. సీఎల్పీ విలీనంపై స స్పందించిన సీఎం కేసీఆర్.. అది కాంగ్రెస్ పార్టీ లోపమన్నారు. రాజ్యాంగం ప్రకారమే కాంగ్రెస్‌ సభ్యుల విలీనం జరిగిందన్నారు.

మున్సిపల్ చట్టం ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతుందన్న కేసీఆర్‌. దీనిపై పెద్దగా చర్చ అవసరం లేదన్నారు. సభ ఏకాభిప్రాయంతో ఆమోదించాలని కోరారు. సభ్యుల మద్దతుతో తెలంగాణ మున్సిపల్‌ 2019 యాక్ట్‌ సభ ఆమోదించినట్టు ప్రకటించారు స్పీకర్‌ పోచారం. రైతు రుణ విమోచన బిల్లుతో పాటు.. పంచాయితీరాజ్‌ రెండో చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభలో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు ఎంఐఎం, బీజేపీ కూడా మద్దతిచ్చాయి. బిల్లులు అమోదం అనంతరం సభ వాయిదా పడింది. శుక్రవారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది అసెంబ్లీ.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక గవర్నర్‌ను నియమించిన తర్వాత నరసింహన్‌ను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీటి వివరాలను వివరించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. శాసనసభ సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు సహా ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు కొత్త పురపాలక బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు.. మండలిలోనూ ఆమోం పొందిన తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చనుంది.

Tags

Next Story