భారత జట్టు ఎంపిక వాయిదా

భారత జట్టు ఎంపిక వాయిదా పడింది.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు జట్టును ప్రకటించాల్సి ఉంది.. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోబోనని చెప్పడంతో జట్టు ఎంపికను సెలక్టర్లు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.. ఈ పర్యటనకు కోహ్లీ అందుబాటులో ఉండటంతో అతని సమక్షంలో లేదంటే అతనితో చర్చించి జట్టు ఎంపిక చేయాల్సి ఉంటుంది.. దీంతో ఆదివారం సెలెక్టర్లు సమావేశమై జట్టును ప్రకటిస్తారని సమాచారం.
వరల్డ్‌కప్ ఓటమి తర్వాత టీమిండియాలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.. కెప్టెన్‌ను మారుస్తారు, సీనియర్లకు సెలవిస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో అటు ఆటగాళ్లలో ఇటు క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ కనబడుతోంది.. త్వరలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనుంది టీమిండియా.. ఆగస్టు మూడు నుంచి వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన ఆరంభమవుతుంది.. విండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై సెలెక్టర్లు సీరియస్‌గా దృష్టిపెట్టారు.. వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో జట్టులో ఎవరుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ధోనీ, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్లు వీడ్కోలు దశలో ఉండగా.. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లు వన్డేల్లో ఆడేందుకు ఎదురు చూస్తున్నారు.. మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, విజయ్ శంకర్ తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాములా మారింది. వెస్టిండీస్ టూర్‌కు విరాట్ కోహ్లీ వెళ్తారా లేదా అన్నది ఇప్పటికీ సందేహంగానే ఉంది.. ఇటీవల వెస్టిండీస్ టూర్‌కు సెలవు ప్రకటించిన కోహ్లీ.. ఆ తర్వాత అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.. అయితే, ఫైనల్ టీమ్‌లో కోహ్లీ ఉంటారా లేదంటే కోహ్లీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఇక టీమిండియాలో ఎక్కువగా వినబడుతున్న పేరు ఎంఎస్ ధోనీ.. మిస్టర్ కూల్‌ని జట్టులో కొనసాగిస్తారా లేదా అనేది కూడా ఆదివారం తేలనుంది.. జట్టులో ధోనీ పాత్ర ఏంటన్న అంశంపై సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రిటైర్మెంట్‌పై ధోనీ ఏమనుకుంటున్నారో అతన్నే సెలెక్టర్లు అడిగే అవకాశం లేకపోలేదు.. ఒకవేళ రిటైర్మెంట్ ఆలోచన లేకపోయినా, ప్రస్తుతానికి తాత్కాలికంగా ధోనీని పక్కన పెట్టొచ్చని తెలుస్తోంది.. లేదంటే, 15వ ఆటగాడిగా జట్టులో స్థానమిచ్చి మార్గనిర్దేశకుడిగా కొనసాగించే అవకాశమూ కనబడుతోంది. ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను రెగ్యులర్ కీపర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.
భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, చాహల్ చోటు ఖాయంగా కనబడుతోంది.. దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది.. అటు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ధావన్.. మళ్లీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.. ఒకవేళ ధావన్ జట్టులోకి వస్తే రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు.. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది.. మొత్తంగా సెలెక్టర్లు జట్టు కూర్పును ఎలాచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com