ఏసీబీ కస్టడీకి కేశంపేట తహసీల్దార్‌ లావణ్య

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్న కేశంపేట తహసీల్దార్‌ లావణ్య నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.. లావణ్యను రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలతో లావణ్యను కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ అవినీతి జలగ చంచల్‌గూడ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉంది.

ఇటీవల కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.. విచారణలో తహసీల్దార్‌ లావణ్య పేరు కూడా బయటకు వచ్చింది.. దీంతో హయత్‌నగర్‌లోని లావణ్య ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు.. 93 లక్షల నగదు, 40 తులాలకుపైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.. రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్‌ అవార్డు అందుకున్న లావణ్య అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

మరోవైపు లావణ్య అక్రమాలు తవ్వే కొద్ది భారీగా బయటపడుతున్నాయి. కేశంపేటలో ఏసీబీ అధికారుల విచారణ మొదలెట్టడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ఇప్పటికే తహశీల్దార్‌ దగ్గర 450 మ్యుటేషన్‌ దరఖాస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్ల బృందం కేశంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. తహసీల్దార్‌ కార్యాలయంలో నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌ కారణం లంచాలేనా అని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ఒక్కొక్కరుగా బాధితులు ముందుకు వస్తూ.. తమను వీఆర్వో, తహశీల్దార్ ఎలా ఇబ్బందులు పెట్టారో గోడు వెళ్లబోసుకున్నారు. అటు వీఆర్వో అనంతయ్య, తహసీల్దార్‌ లావణ్య అరెస్ట్‌ సందర్భంలో ఏసీబీ అధికారులకు కొన్ని పట్టాదారు పాస్‌పుస్తకాలు లభ్యమయ్యాయి. లావణ్య కారులో 12, ఆమె చాంబర్‌లో 3, అనంతయ్య దగ్గర 13 చొప్పున పాస్‌బుక్‌లు లభ్యమయ్యాయి. వారిద్దరూవాటిని ఎందుకు తమ దగ్గర పెట్టుకున్నారనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేపడుతోంది.. అలాగే పట్టాదార్‌ పాసుపుస్తకాల యజమానుల వాంగ్మూలాన్ని కూడా అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లావణ్య నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది.. న్యాయస్థానం ఆదేశాలతో ఈరోజు లావణ్యను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.. ఇప్పటి వరకు తీసుకున్న లంచాల లిస్టంతా కక్కించనున్నారు.. అలాగే ఈమెకు సహకరించిన వారెవరనే వివరాలు రాబట్టనున్నారు.

Tags

Next Story