సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు - చంద్రబాబు

సీఎం జగన్‌ అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారు - చంద్రబాబు

పీపీఏలు, పోలవరంపై చర్చతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. పీపీఎలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌ ఆరోపణలను ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. . వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్.. అక్కడ ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఒప్పందాలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు గుప్పించారు జగన్‌. అటు పోలవరంపైనా... అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. గత TDP ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆరోపణలను ఖండించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. పీపీఏలపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణలు, రెగ్యులేటరీ తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కరెంట్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ పాలనలో కోతలు లేని కరెంటు అందించామన్నారు. జగన్‌ చర్యలతో మళ్లీ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తలెత్తాయని విమర్శించారు చంద్రబాబు. కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్న సీఎం జగన్ .. ఎక్కువ రేటుకు విద్యుత్‌ను అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలపై సదరు సంస్థలను ఒప్పించి రేట్లను తగ్గిస్తే తాను కూడా సంతోషిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం తప్పులను ఎత్తిచూపే హక్కు తమకుందన్నారు.

జగన్ నిర్వాకంతో అంతర్జాతీయంగా ఏపీ ప్రతిష్ట దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీ రేటింగ్‌ను దిగజార్చారని మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఆరోపణలు చేసేముందు జగన్‌ కూడా ఒకసారి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైసీపీ కాదా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్షనేత ఆరోపణలను తిప్పికొట్టారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా పీపీఏలు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. థర్మల్ విద్యుత్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నా.. పవన విద్యుత్ కొన్నారని విమర్శించారు. కొందరికి లాభం చేకూర్చేందుకే ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతుకుముందు పోలవరం ప్రాజెక్టు పనుల అంశం అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. పోలవరంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ప్రతిపక్ష సభ్యులు. పోలవరం పనుల్ని ప్రభుత్వం ఆపివేసిందంటూ విమర్శించారు. దీంతో సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం మొదలైంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్టా, గోదావరిలో నీటి లభ్యత పడిపోతుందని.. ఈనేపథ్యంలో పోలవరం పనులను త్వరిగతంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.

పోలవరంపై నిపుణుల కమిటీ స్టడీ చేస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. నాలుగు నెలలుగా పనులు ఆగిపోయాయని.. వాటిని నవంబర్‌లో ప్రారంభిస్తామని శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. 2021 నాటికి నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తొలిసారిగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని చెప్పారు జగన్‌. సీఎం సమాధానంపై సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు పూర్తిస్థాయిలో చర్చకు పట్టుపట్టారు. ఏపీ హక్కులను జగన్‌ ప్రభుత్వం తెలంగాణకు తాకట్టుపెట్టిందంటూ సభలో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. అటు పీపీఏలు, ఇటు పోలవరంపై చర్చతో.. అసెంబ్లీ వాడివేడిగా సాగింది.

Tags

Next Story