క్రికెట్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఐసీసీ

క్రికెట్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఐసీసీ.. తమ అభిమాన ఆటగాడు ఆడలేని పరిస్థితిలో గాయాల పాలైతే.. కేవలం 10 మందే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చేది. రిటైర్డ్‌హర్ట్‌ అయిన ప్లేయర్‌ ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్‌ వచ్చినా.. కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం అయ్యేవాడు.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కీలక సవరణకు ఇప్పుడు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. దీంతో సబ్‌స్టిట్యూట్‌ కూడా బ్యాటింగ్‌, లేదా బౌలింగ్‌ చేయొచ్చు.

క్రికెట్‌లో సమూల మార్పులపై ఫోకస్ చేసింది ఐసీసీ. ఇందులో భాగంగా కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కీలక సవరణకు ఆమోద ముద్ర వేసింది. ఒక క్రికెటర్‌ గాయమైనప్పుడు ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయితే.. వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది. తలకు బాగా బలమైన దెబ్బ తగిలినప్పుడు ఈ కాంకషన్‌ స్థితి వస్తుంది. మెదడు అదరడం, తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం, తలతిరిగినట్లు ఉండడం, కాసేపు దృష్టి మందగించడం వంటివి దీని లక్షణాలు. ఫీల్డర్లకు కూడా బంతి తగిలినప్పుడు దాదాపు ఇలాంటి పరిస్థితే. అలాంటి ఆటగాడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే అతడి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ మాత్రమే చేయగలడు. మొన్నటి ప్రపంచ కప్‌ వరకు ఇదే నిబంధన కొనసాగింది. ఇప్పుడు ఐసీసీ ఈ నిబంధనకు సవరణ చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్లలో, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు అధికారికంగా ఆమోదం లభించింది. అయితే ఆటగాళ్ల భర్తీ నిర్ణయం జట్టు వైద్య ప్రతినిధి తీసుకుంటారని ఐసీసీ పేర్కొంది. మ్యాచ్‌ రిఫరీ దీనికి ఆమోదం తెలుపలాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌ నుంచి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అమల్లోకి వస్తుంది.

ఐసీసీ కీలక నిర్ణయంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటి వరకు ప్రధాన ఆటగాడు ఆడలేని స్థితిలో గాయపడితే.. సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యేవాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. చాలా మ్యాచ్‌ల్లో ప్రధాన ఆటగాడు రిటైర్డ్‌హర్ట్‌ అయితే.. కేవలం 10 మందే బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చేది.. ఐసీసీ తాజా నిబంధనతో సబ్‌స్టిట్యూట్‌ కూడా బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేసే అవకాశం దక్కుతుంది.

Tags

Read MoreRead Less
Next Story