విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోకి చొరబడ్డ దొంగలు..
తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీలో భారీ చోరీ చోటుచేసుకుంది. విద్యార్థినులు కాలేజీకి వెళ్లగానే హాస్టల్ లోని హరిణి బ్లాక్ లోకి చొరబడ్డ దొంగలు.. బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ నెల 15న ఈ చోరీ జరిగినా .. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. పద్మావతి డిగ్రీ కాలేజీలోని హరిణి హాస్టల్లో ఏకంగా 300 మంది విద్యార్ధినుల బ్యాగుల్లోని నగదు, నగదు చోరీ అయ్యాయి. విషయం కనుక్కునేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిని కూడా అనుమతించలేదు. పైగా టీటీడీ సంస్థల్లో వీడియో తీయొద్దంటూ దురుసుగా ప్రవర్తించారు.
300 మంది విద్యార్ధుల నగదు, నగలు ఎత్తుకెళ్లినా.. చోరీ చాలా చిన్నదని చెబుతున్నారు కళాశాల ప్రిన్సిపల్. 50వేల రూపాయల నగదుతో పాటు బంగారు కమ్మలు, చెవిదుద్దులు, కాళ్ల పట్టీలు దొంగతనానికి గురయ్యాయని తెలుస్తోంది. గత బుధవారం దొంగతనం జరిగినా విషయం బయటికి పొక్కనీయలేదు హాస్టల్ నిర్వాహకులు. అమ్మాయిలు ఉండే హాస్టల్ లో 300 బ్యాగులను వెతికి చోరీకి పాల్పడేంత సమయంలో సెక్యూరిటీ ఏం చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. సిబ్బంది చేతి వాటమా..లేక విద్యార్ధులు ఎవరైనా దొంగతనం చేశారా తేలాల్సి ఉంది. అంత సమయం హాస్టల్ లో గడిపే అవకాశం ఇంటి దొంగలకే ఉంది కాబట్టి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com