తమ్ముళ్లకు తల్లిలేని లోటును తీరుస్తున్న కూతురిని చంపిన తండ్రి

తమ్ముళ్లకు తల్లిలేని లోటును తీరుస్తున్న కూతురిని చంపిన తండ్రి

మేడ్చల్ జిల్లా కేంద్రం ఎస్సీ కాలనీలో జరిగిన 14 ఏళ్ల బాలిక మర్డర్‌ మిస్టరీ వీడుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని మహిళతో కలిసి కన్న తండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక హత్య వెలుగు చూసిన తర్వాత నిందితుడి కోసం గాలిస్తున్న క్రమంలో బాలిక తండ్రే పోలీసులకు లొంగిపోయాడు. హత్యలో పాత్రధారి అయిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అల్వాల్‌కు చెందిన సుబ్రహ్మణ్యంకు భార్య, కూతురు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో.. తండ్రే వారి బాగోగులు చూసుకుంటున్నాడు. స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నాడు. తండ్రి రోజు తన పనులకు వెళ్తుంటే.. ఐదారేళ్ల వయస్సున్న తమ్ముళ్లకు తల్లిలేని లోటును తీరుస్తు కంటికి రెప్పలా కాపాడుతుంది 14 ఏళ్ల బాలిక.

భార్య మరణించిన కొద్ది రోజులకే సుబ్రహ్మణ్యంకు మరో మహిళ పరిచయం అయ్యింది. వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధంకు దారితీసింది. ఇది తెలిస్తే చుట్టుపక్కల వారితో పాటు బంధువుల నుండి విమర్శలు వస్తాయని మేడ్చల్‌కు మకాం మార్చాడు. మేడ్చల్ ఏస్సీ కాలనీలో ఓ పెంకుటిల్లును అద్దెకు తీసుకొని.. మహిళను నేరుగా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. తల్లి మరణించిన దుఖం లో వున్న పిల్లలు మరో మహిళ ఇంట్లో రావడం.. ఆమె పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేకపోయారు. పలు మార్లు తండ్రి కూతురి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది.

తన వివాహేతర సంబంధానికి కూతురు అడ్డురావడాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ దూరమవుతుందనే అక్కసుతో కన్న కూతురినే కడతేర్చి వుంటాడని పోలీసులు అనుమానించారు. తండ్రి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని ఆ కోణంలో విచారణ చేపట్టారు. కన్న తండ్రే కూతురు ను హత్య చేశాడనే విషయం తెలుసుకున్న కాలనీ వాసులు...అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తండ్రి లేని సమయంలో ముగ్గురు పిల్లలను ఆ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురిచేసేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఆమె కన్నతల్లే అనుకున్నామని.. పరాయి మహిళ అనుకోలేదంటున్నారు స్థానికులు. మహిళతో కలిసి సుబ్రహ్మణ్యం హత్య చేశాడా.. లేదా అతడొక్కడే హత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు రోజు మహిళ కూడా ఇంట్లోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story