వైభవంగా లష్కర్ బోనాలు...

వైభవంగా లష్కర్ బోనాలు...

సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవం వైభవం జరుగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భాక్తులు భారీ సంఖ్యలో తరలొస్తున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుంటున్నారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో బోనాల మహోత్సవం సందడిగా కొనసాగుతోంది. గతేడాది భారీ క్యూ లైన్లతో ఎదురైనా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సారి బోనాలను సమర్పించే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఒకటి, రాంగోపాల్‌పేట పాత పోలీస్‌స్టేషన్ నుంచి మరొకటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

లష్కర్ బోనాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉజ్జయిని అమ్మవారి బోనాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు మొదటి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. తొలి బోనంతో పాటు వెండి తొట్టెలను మంత్రి అమ్మవారికి సమర్పించారు.

మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజారులు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారినికి బోనం సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి కూడా ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావటంతో క్యూ లైన్లన్ని నిండిపోయాయి. అయితే..పోయినేడాది అనుభవాలతో ఈ సారి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. పోలీస్ అధికారులు భారీ బందోబస్తు, జీహెచ్‌ఎంసీ, జల మండలి, ఎలక్ట్రిసిటీ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.

గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు జోగిని శ్యామల. పోయినేడాది ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టిన ఆమె..ఈ సారి మాత్రం ప్రశంసలు కురిపించారు. వర్షాల కోసం 108 ప్రదక్షణలు చేస్తానంటున్నారు జోగిని శ్యామల.

Tags

Read MoreRead Less
Next Story