చంద్రయాన్‌ 2.. చంద్రుడిపైకి ఎన్ని రోజుల్లో చేరుకుంటుందంటే..!

చంద్రయాన్‌ 2..  చంద్రుడిపైకి ఎన్ని రోజుల్లో చేరుకుంటుందంటే..!

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.. జాబిలి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేపడుతున్న ప్రయోగం మరికొద్ది గంటల్లోనే జరగనుంది.. ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలిచే దిశగా భారత్‌ ముందడుగు వేయబోతోంది.. సాంకేతిక కారణాలతో వాయిదా పడిన ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం జరిగే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పదివేల మందికి అవకాశం కల్పిస్తోంది ఇస్రో.

కోట్ల మంది నిరీక్షణ ఫలించే టైం వచ్చింది. వాయిదా పడిన చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని చేపట్టడానికి ఇస్రో రెడీ అయింది. మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నిప్పులు కక్కుతూ నింగికి ఎగరనుంది బాహుబలి లాంటి జీఎస్‌ఎల్వీ-ఎంకే3-ఎం1. ఈ రాకెట్ చంద్రయాన్‌ 2ను మోసుకెళ్లి చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి SDSC రెండో లాంచ్ పాడ్‌ నుంచి ఈ ప్రయోగం చేపడుతోంది.

చంద్రయాన్ 2ను ఈ నెల 15న ప్రయోగించడానికి ఇస్రో కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. కానీ క్రయోజనిక్ స్టేజ్‌లో బ్యాటరీలు ఛార్జ్ కాకపోవడం, హీలియం గ్యాస్ లీక్‌ కావడాన్ని గుర్తించిన ఇస్రో.. ప్రయోగాన్ని అత్యవసరంగా వాయిదా వేసింది. శాస్త్రవేత్తలు సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో ఇస్రో రీషెడ్యూల్ ప్రకటించింది.

ప్రయోగం వారం రోజులు వాయిదా పడినా చంద్రయాన్‌ 2 జాబిలిపై ల్యాండ్ అయ్యే తేదీలో మార్పు ఉండదని ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 8న చంద్రుడిపై దిగనుంది. దీని కోసం ఇస్రో కొన్ని మార్పులు చేసింది. చంద్రయాన్ 2 భూకక్ష్య నుంచి మూడున్నర లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 47 రోజుల్లో ఇది చంద్రుడిపైకి చేరుకుంటుంది. ఇంతకుముందు 54 రోజులున్న ఈ ప్రయాణ కాలాన్ని కుదించించారు.

Tags

Read MoreRead Less
Next Story