వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ

వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ

తెలంగాణతోపాటు ఏపీలోనూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. 2024 ఎన్నికల్లో పార్టీని మరింత బలపరిచే దిశగా ఇప్పట్నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది.. అటు టీడీపీని మరింత దెబ్బతీయడంతోపాటు అధికార వైసీపీని కూడా టార్గెట్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ పాలనపై రోజూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ వస్తున్నారు కమలనాథులు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, పెరిగిపోతున్న రాజకీయ దాడులపై ఆరోపణాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన ట్యాగ్‌ వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతి జరుగుతోందని ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన జగన్‌ ఇప్పుడు అదే పనిచేస్తున్నారని కన్నా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో బీజేపీ సంఘటనా పర్వ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా ఆయన ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి మోదీ పాలన ముఖ్యమని, ఆయన పాలనలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు కన్నా.

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నాతోపాటు, జాతీయ మహిళా మోర్చా కన్వీనర్‌ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్ని సీఎం జగన్‌ మభ్యపెడుతున్నారని ఆమె ఫైరయ్యారు. హోదా సాధ్యం కాదని తెలిసినా ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. ప్యాకేజీకి అనుగుణంగా రాష్ట్రానికి నిధులు అందుతున్నాయని పురందేశ్వరి చెప్పారు. జగన్‌ మొదట తీసుకున్న ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయం మొదలు.. ప్రతి విషయంపైనా ఒకటే వ్యూహంతో ముందుకెళ్తున్నారు కమలనాథులు. గ్రామ, మండల స్థాయిలో ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులకు తెగబడటం, ఎదురుతిరిగిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదుచేయడంపైనా తీవ్రంగా ఫైరవుతున్నారు.

Tags

Next Story