కర్నాటక పాలిటిక్స్.. సుప్రీం తలుపు తట్టిన ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు

కర్నాటక పాలిటిక్స్.. సుప్రీం తలుపు తట్టిన ఇద్దరు  స్వతంత్య్ర ఎమ్మెల్యేలు
X

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న కర్నాటక పాలిటిక్స్ చివరి దశకు వచ్చాయి. సోమవారం కుమారస్వామి భవిష్యతు తేలిపోనుంది. ఈ ఎపిసోడ్‌‌ ఎలాంటి టర్న్ తీసుకోనుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండూ పార్టీలు వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి.

అటు.. ముంబైలో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేల్ని బుజ్జగించే పర్వం కొనసాగుతోంది. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలలో సగం మందిని వెనక్కి తీసుకొచ్చినా విశ్వాసపరీక్ష గట్టెక్కొచ్చు. ఆ దిశగా మంతనాలు సాగిస్తోంది కాంగ్రెస్. కచ్చితంగా బలపరీక్ష గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. రామలింగా రెడ్డి తిరిగి రావడం కాంగ్రెస్ కు పెద్ద ఊరట . ఆయన ద్వారానే మిగిలిన రెబల్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది కాంగ్రెస్. జేడీఎస్ దళపతి దేవేగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. రామలింగారెడ్డితో ఆయన చర్చలు జరిపారు. కానీ రెబల్ ఎమ్మెల్యేలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కుమారస్వామి రాజీనామా చేసిన తర్వాతే ముంబై నుంచి వస్తామని స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు.. బెంగళూరులో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఈ సమావేశానికి సీఎల్పీ లీడర్ సిద్ధరామయ్య, సీపీసీ చీఫ్ గుండూరావు సహా ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. సీఎల్పీ భేటీ అనంతరం.. గుండూరావు కీలక వాఖ్యలు చేసారు. ఇవాళ సభలో ఓటింగ్‌ జరిగే అవకాశాల్లేవన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని ఆ మేరకే తమ నిర్ణయం ఉంటుందన్నారు. అటు.. బీజేపీ శాసనసభాపక్షం కూడా హోటల్ రమదలో సమావేశమైంది. ఇవాళ ఉదయం మరోసారి భేటీ కానున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళ సభలో బలపరీక్ష నిర్వహించే విధంగా పట్టుబట్టాలని నిర్ణయించారు. అంతేకాదు.. సంకీర్ణ సర్కారుకు చివరి రోజంటూ హెచ్చరించారు యడ్యూరప్ప. మరోవైపు.. ఇద్దరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు సుప్రీం తలుపుతట్టారు. విశ్వాసపరీక్ష నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తమ పిటిషన్‌లో కోరారు. కుమారస్వామి సర్కారుకు చివరి రోజన్నారు యడ్యూరప్ప. స్పీకర్ రమేష్ కుమార్, సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. అన్ని ప్రశ్నలకు ఇవాళ అసెంబ్లీలో సమాధానం దొరుకుతుందన్నారు యడ్యూరప్ప.

మరోవైపు సభ్యులకు విప్‌ జారీ, గవర్నర్‌ జోక్యంపై దాఖలైన పిటిషన్లు కూడా ఇవాళ సుప్రీం కోర్టు ముందుకు రానున్నాయి. ఈ అంశంపై మరింత లోతుగా విచారించేందుకు కోర్టు స్టే విధిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం ఒడ్డున పడ్డట్లేనని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సాకుతో చర్చలను మరింత సాగదీసే అవకాశం దొరుకుతుంది. సుప్రీం తీర్పు వచ్చే వరకు కాలయాపన చేయవచ్చు. మరో వైపు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతికి సంతాపంగా సభను వాయిదా వేసే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వచ్చిన వార్తలను సీఎం కుమారస్వామి స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇవాళ జరిగే సభకి హాజరవుతానని ప్రకటించారు. మరోవైపు.. గవర్నర్ ఇచ్చిన రెండు గడువులను సీఎం కుమార స్వామి ఖాతరు చేయలేదు. దీంతో రాష్ట్రంలో పరిస్థితిని ఇప్పటికే కేంద్రానికి వివరించారు గవర్నర్ వాజూభాయ్ వాలా. ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలన విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story