ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఆవేదన.. వైసీపీ తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాజధాని ప్రాజెక్టు నుంచి వరల్డ్ బ్యాంక్‌ డ్రాపవడం సభను కుదిపేసింది. వైసీపీ తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అది గత ప్రభుత్వ నిర్వాకమే అంటూ ప్రభుత్వం కౌంటర్‌ ఇచ్చింది. మరోవైపు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

అమరావతి ప్రాజెక్టు నుంచి డ్రాప్‌ అవుతూ వరల్డ్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రభుత్వ తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. జగన్‌ సర్కార్‌ నిర్ణయాలు సరైనవేనని రాజధాని రైతులు చెబితే తాను దేనికైనా సిద్ధమేనని చంద్రబాబు సవాల్‌ విసిరారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గతంలోనూ వైసీపీ నాయకులు అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారని గుర్తు చేశారు. రాజధానికి వ్యతిరేకంగా వరల్డ్‌ బ్యాంక్‌కు లేఖలు రాశారని తెలిపారు చంద్రబాబు.

ప్రపంచ బ్యాంకు నిధులపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ నిధులపై మంత్రి వివరణ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందన్నారు. వైసీపీ తీరును నిరసిస్తూ అసెంబ్లీలో తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడి ఆపి అర్ధవంతమైన చర్చలో పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జగన్‌ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ స్టేట్‌మెంట్‌పై.. అభ్యంతరాలు చెప్పాలి తప్ప.. తానే స్టేట్‌మెంట్‌ ఇస్తానంటే ఎలాగని సీఎం ప్రశ్నించారు. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, నామినేషన్‌ పనుల్లో, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కోటా కల్పించే బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది.

Next Story

RELATED STORIES