ఆంధ్రప్రదేశ్

వైసీపీ దాడులు, పోలీసుల అక్రమ కేసులపై బీజేపీ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై దూకుడు పెంచింది బీజేపీ. వరుస ఆరోపణలతో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతోంది. ఏపీలో బలోపేతమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీ.. పోరాటానికి సిద్ధమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై సాఫ్ట్‌ కార్నర్‌ అవలంభించిన బీజేపీ.. అధికారంలోకి రాగానే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. రోజుకో ఆరోపణలతో అధికార పక్షం వైసీపీపై ఎదురు దాడికి దిగుతోంది. ఏపీలో వైసీపీ అరాచకాలు తారా స్థాయికి చేరాయని విమర్శిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ముఖ్యంగా వైసీపీ దాడులు, పోలీసుల అక్రమ కేసులు, ఇసుక పాలసీల జాప్యంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో వైసీపీ దాడులు, పోలీసుల అక్రమ కేసులకు వ్యతిరేకంగా గురజాలలో ఆందోళనలు చేస్తామని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

ఇసుక పాలసీ విషయంలో ప్రభుత్వ జాప్యంపై కూడా కన్నా లక్ష్మీనారాయణ విరుచుపడ్డారు. ప్రభుత్వ తీరుతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని.. ఇసుక పాలసీని సీఎం ఎందుకు వాయిదా వేస్తున్నారో తనకు అర్థంకావడం లేదన్నారాయన. బీజేపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ వాళ్లు కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.

అటు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 50 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. సీఎం జగన్‌ చెప్పే మాటలకు, ఆపార్టీ నేతలు చేసే పనులకు పొంతనే లేదని విమర్శించారు. మొత్తంగా ఏపీ బీజేపీ నేతల తీరు చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES