చింతమడక గ్రామస్తులపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన స్వగ్రామం చింతమడకలో పర్యటించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సీఎం హోదాలో తొలిసారి ‌సొంతూరు వెళ్లిన కేసీఆర్‌కు.. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ ఊరు ముద్దు బిడ్డ వచ్చాడని మురిసిపోయారు. ముందుగా శివాలయం, రామాలయం వెళ్లారు కేసీఆర్‌. ఆ తరువాత గ్రామదేవతలకు పూజలు చేశారు. బాల్య మిత్రులతో ముచ్చటించారు. అందరిని ఆప్యాయంగా పలకరించారు.

చింతమడకలో నిర్వహించిన ఆత్మీయ అనురాగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. తన సొంత ఊరుపై వరాల జల్లు కురిపించారు. అండగా ఉంటానని మాటిచ్చారు. ప్రతి కుటుంబం పది లక్షల రూపాయలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటానన్నారు. నెల రోజుల్లో ఊళ్లో సమస్య అనేది లేకుండా చేయాలంటూ కలెక్టర్‌, ఎమ్మెల్యేల్ని ఆదేశించారు కేసీఆర్‌. ప్రతి కుటుంబానికి 10 లక్షలు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదనంగా గ్రామానికి 50 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారాయన. చింతమడక.. బంగారు తునక కావాలని సీఎం ఆకాంక్షించారు.

చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌. కార్తీక మాసంలో గృహప్రవేశాలు జరుగుతాయన్నారు. చింతమడక తనని కనిపెంచిందన్న ఆయన.. గ్రామానికి ఎంత చేసినా తక్కువేన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు కూడా పాల్గొన్నారు. కేసీఆర్‌ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైందన్నారు హరీష్‌రావు. సీఎం ఇచ్చిన వరాలతో చింతమడక చింతలేని గ్రామం అవుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story