తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చిన గవర్నర్ నరసింహన్

ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇటీవలే అసెంబ్లీలో రెండు సభల ఆమోదం పొందిన నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లు లోని కొన్ని అంశాలపై నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త మునిసిపల్ చట్టం ప్రకారం.. ఎన్నికల నిర్వ హణపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చట్టం లో పొందుపర్చడం అంటే ఎన్నికల సంఘంపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఆజమాయిషీ చలాయించడమేనని.. దేశంలో ఇలాంటిదెక్కడా లేదని గవర్నర్ అభిప్రాయ పడినట్లు సమాచారం. ఇక హరిత హారంలో నాటిన మొక్కల్లో 85% మొక్కలు చనిపోతే ఆయా స్థానిక సంస్థల పరిధిని బట్టి సర్పంచి, గ్రామ కార్యదర్శి, కౌన్సిలర్, మునిసిపల్ చైర్మన్, మేయర్ లను బాధ్యులను చేస్తూ వారిని పదవుల నుంచి తొలగిస్తామన్న నిబంధనపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కొత్త పురపాలక చట్టం ఉభయ సభల ఆమోదం పొందిన మరుసటి రోజే గవర్నర్ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ నరసింహన్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలంటూ బిల్లును తిప్పి పంపారు. మరోవైపు అసెంబ్లీ ప్రొరోగ్ కావడంతో గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
మరోవైపు.. మున్సిపల్ బిల్లుకు గవర్నర్ సవరణలు సూచించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ్య శక్తుల విజయమని..గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. చట్టంలో ఇంకా అనేక లొసుగులున్నందున ఆర్డినెన్స్ తేవడం సరికాదని... దీనికి బదులు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఏదేమైనా మొదటి సారి గవర్నర్ నరసింహన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com