అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించిన చంద్రబాబు

అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సెషన్‌ మొత్తం సస్పెన్షన్‌ చేయడం కలకలం రేపింది. ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గతంలో పాదయాత్ర సమయంలో వరుస హామీలు ఇచ్చిన జగన్‌ ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ.. అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించారు చంద్రబాబు..

అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల మీద ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా అంటూ సీరియస్‌ అయ్యారు. సీటులో కూర్చున్న బీసీ నాయకుడు అచ్చెన్నాయుడ్ని ఎందుకు సస్సెండ్‌ చేశారని.. ఇదేనా బీసీలకు మీరు చేసే న్యాయమని ప్రశ్నించారు.

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై.. నారా లోకేష్. ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుల పరిస్థితి ఇదా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ మోసుకెళ్తున్న ఫోటోని ట్వీట్ చేశారు లోకేష్. ప్రజల పక్షాన తాము గొంతు విప్పుతున్నందుకే.. ఆ గొంతును నొక్కే ప్రయత్నం ప్రభత్వం చేస్తోందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు.

జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. ప్రజాసమస్యలపై నిలదీస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

అంతకుముందు ఛాంబర్‌లో డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తాము సభకు సహకరిస్తామని తమను సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా తీసుకువెళ్లడం అప్రజాస్వామికమని ఉప సభాపతి దృష్టికి తెచ్చారు. విపక్షాల వాదనను అధికారపక్షం దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ స్పీకర్. శాసన సభా వ్యవహారాల మంత్రి బుగ్గన, చీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డితో చర్చించారు. తర్వాత టీడీపీ నేతల్ని తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా TDP ఎమ్మెల్యేలు 3 ప్రతిపాదనలు ఉపసభాపతి ముందు ఉంచారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ప్రశ్నోత్తరాలకే పరిమితం చేయాలని కోరారు. ఒకవేళ పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటే.. తమ సభ్యులందరినీ ఈ సెషన్ మొత్తానికి బయటకు పంపించేయాలన్నారు. ప్రశ్నోత్తరాల్లో తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story