మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్ ఎందుకు మాట మార్చారు - చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న జగన్ హామీపై సభలో టీడీపీ సభ్యులు నిలదీశారు. దీంతో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేశారు స్పీకర్. తమ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో పాదయాత్ర సమయంలో వరుస హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించారు.
పెన్షన్ల మీద ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ సీరియస్ అయ్యారు చంద్రబాబు. సీటులో కూర్చున్న బీసీ నాయకుడు అచ్చెన్నాయుడ్ని ఎందుకు సస్పెండ్ చేశారని.. ఇదేనా బీసీలకు మీరు చేసే న్యాయమని ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్.. పెన్షన్ల విషయంలో మాట ఎందుకు మార్చారని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీని సైతం పులివెందుల చేయాలని సీఎం జగన్ చూస్తున్నారంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని వైసీపీ చూస్తుందని...అందుకే అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. సభలో జగన్ శాసిస్తే.. స్పీకర్ తూచా తప్పకుండా పాటిస్తారంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రం లో వైసీపీ పాలనతో ప్రజల్లో అలజడి మొదలైందన్నారు టీడీపీ అధినేత. టీడీపీపై బురద జల్లే ప్రయత్నంలో రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తున్నారని వైసీపీపై ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ లీడర్‌లను సస్పెండ్ చేయడం తీవ్రమైన అంశమని చంద్రబాబు అన్నారు. టీడీపీ సభ్యులపై వేటు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com