అయ్యో రష్మికా అలా ఎందుకన్నావ్.. అనవసరంగా బుక్కయ్యావ్..

అయ్యో రష్మికా అలా ఎందుకన్నావ్.. అనవసరంగా బుక్కయ్యావ్..

కన్నడ కుట్టి అయి ఉండి కన్నడ భాష రాదంటే పరువేం కాను.. మాతృభాషపై ఆ మాత్రం మమకారం లేకపోతే ఎలా.. పుట్టి పెరిగిన ఊరి భాషే రాదంటే ఇతర భాషలు ఎలా నేర్చుకుంటావ్.. ఆయా భాషా చిత్రాల్లో ఎలా నటిస్తావ్.. ఏది ఏమైనా ఇది చాలా అవమానకరం అంటూ కన్నడిగులు రష్మికపై ధ్వజమెత్తుతున్నారు. తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదట శాండల్‌వుడ్ ద్వారానే చిత్ర రంగ ప్రవేశం చేసింది. అక్కడినించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస హిట్లతో లక్కీ స్టార్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటోంది. మహేష్‌బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తోంది.

డియర్ కామ్రెడ్‌తో మరోసారి తెరను పంచుకున్న రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి కన్నడ సరిగా మాట్లాడడం రాదని.. ఆ భాషలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమని చెప్పింది. రష్మిక వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కన్నడిగులు రష్మిక వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కర్ణాటక సంస్థల కూటమి 'జాగా'.. కన్నడ వాణిజ్య మండలిని కలిసింది. శాండల్‌వుడ్ నుంచి ఆమెను తప్పించాలని, ఆమెపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ.. కన్నడ కష్టంగా ఉంది.. మాట్లాడలేకపోతున్నాను అని అనడం ఏంటని భాషాభిమానులు రష్మికపై ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు రష్మికకు సమన్లు జారీ చేస్తామని వాణిజ్య మండలి ఛైర్‌పర్సన్ జయరాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా రష్మిక, విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రెడ్ ఈనెల 26న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు, కన్నడ భాషలోనూ డబ్బింగ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story