టీ కాంగ్రెస్ నేతల గెస్ట్ రోల్ అప్పియరెన్స్‌పై హైకమాండ్ సీరియస్!

కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనకూలంగా మలుచుకుని ఉద్యమాలు నిర్మించడంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనే అసంతృప్తిలో ఉన్నారు హస్తిన నేతలు. ఖమ్మంలో రైతులకు బేడీలు, నేరెళ్ల దళితుల మీద దాడి వంటి అనేక తప్పిదాలు జరిగినా వాటిని ఎండగట్టి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో టీ కాంగ్రెస్ విఫలమవుతున్నారన్న అభిప్రాయంలో హై కమాండ్ ఉంది. రాష్ట్ర నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం పెద్దలు..కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటానికి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే భావనలో ఉన్నారు. దీనికి తోడు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై మరింత ఆగ్రహంగా ఉన్నారు
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఇటీవల సీఎం కేసీఆర్ భూమి పూజలు చేశారు. దీన్ని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ నేతలు కొత్త భవనాల నిర్మాణాన్ని నిరసిస్తూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. అయితే కాంగ్రేస్ నేతలు మాత్రం మీడియా సమావేశాలకే పరిమితమయ్యారు. ఇక ఇదే అంశం పై ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరిట మాజీ ఎంపీ వివేక్ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దానికి మాత్రం కాంగ్రెస్ ముఖ్యనేతలంగా మూకుమ్మడిగా హాజరయ్యారు. అనంతరం అన్ని పార్టీల నాయకులను కలుపుకుని వివేక్ .. గవర్నర్‌ను కలిసి భవనాల నిర్మాణాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక సోమవారం అన్ని పార్టీల నాయకులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన వివేక్ ఈ నెల 25న చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశానికి కూడా కాంగ్రెస్ నేతలు అతిథులగా హాజరయ్యారు.
ఇప్పుడిదే విషయం హైకమాండ్ ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని ముందుండి ఉద్యమాలను నడిపించాల్సింది పోయి.. ఏదో అనామక సంఘం పేరట ఓ వ్యక్తి నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావడమేంటని ఢిల్లీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాలతో వివేక్ చేస్తోన్న ఆందోళనల్లో పాల్గొనడాన్ని పార్టీ పెద్దలు తప్పుపట్టినట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర నాయకుల వైఖరిని పార్టీ సీనియర్ నేతలు సైతం తప్పు పడుతున్నారు. హైకమాండ్ మొట్టికాయాలతోనైనా మరి రాష్ట్ర కాంగ్రేస్ నాయకుల్లో మార్పు వస్తుందో లేదో త్వరలో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com