శాఖ‌ల త‌ర‌లింపు ఆల‌స్యం..

శాఖ‌ల త‌ర‌లింపు ఆల‌స్యం..

ప్రస్తుత తెలంగాణ సచివాలయాన్ని కూల్చేసి, కొత్త నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్ప‌టికే అన్ని శాఖ‌ల‌కు మౌఖిక ఆదేశాలు వెళ్లడంతో ఫైళ్లు, ఇతర సరంజామా అంతా సర్దుతున్నారు. ముందుగా సాధారణ పరిపాలన శాఖ....బూర్గుల రామకృష్ణా రావు భవన్ కు మారనుంది. భవనంలోని 8, 9 వ అంతస్తుల్లో సీఎం ఛాంబర్, సీఎంఓ అధికారులు, చీఫ్ సెక్రటరీ, ఆయన పేషీ, సాధారణ పరిపాలన శాఖ ఉంటాయి. అటవీ శాఖ మాత్రం పక్కనే ఉన్న అరణ్య భవన్ కు మారనుంది. అటు ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ శాఖలు ఎర్రమం జిల్లోని ఈఎన్సీ భవనం, జల సౌధకు తరలనున్నాయి. మిగిలిన శాఖలను ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోకి తరలిం చనున్నారు. ఆ ప్రాంగణంలో ఏపీ అప్పగించిన సుమారు 50 ఎమ్మెల్యే క్వార్టర్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిలో ఒక 15 క్వార్టర్లను తాత్కాలికంగా సచివాలయ విభాగాల కోసం వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.

అటు బూర్గుల రామకృష్ణా రావు భవన్‌లో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలన్నింటినీ వేగంగా ఖాళీ చేయిస్తున్నారు. ఏపీ నుంచి స్వాధీనం చేసుకున్న 5, 6వ ఫ్లోరు కూడా ఖాళీగా ఉండ‌టంతో మ‌ర‌మ‌త్తుల ప్ర‌క్రియ జ‌రుగుతోంది. సెక్ర‌టేరియ‌ట్ లోని శాఖ‌ల‌కు అనుగుణంగా,ప‌రిపాల‌నా ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎంత వేగంగా పని జరిగినా నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది..దాదాపు ఏడాదిన్న‌ర పాటు ప‌రిపాల‌నంతా బ‌య‌టి కార్య‌ల‌యాల‌ నుంచి కొన‌సాగించాల్సిఉంటుంది. అందుకే శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వయం లోపించ‌కుండా పూర్తి క‌స‌ర‌త్తు చేసిన త‌రువాతే త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టాల‌ని అదికారులు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఒకే భావ‌సారుప్య‌త క‌లిగిన శాఖ‌ల‌న్నీ ద‌గ్గ‌ర్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

శాఖ‌ల త‌ర‌లింపు ఆల‌స్యం కానుండ‌టంతో ప్ర‌స్తుత స‌చివాల‌య బిల్డింగ్‌ల కూల్చివేత ఇప్ప‌ట్లో లేన‌ట్టే. స‌చివాల‌యంలోని అన్ని శాఖ‌ల్ని పూర్తిస్థాయిలో త‌ర‌లించాలంటే మ‌రో మూడు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. దీనికి తోడు కూల్చివేత‌ల‌పై కోర్టులో కేసు ఉండ‌టంతో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి లేదు. శాఖ‌ల త‌ర‌లింపు పూర్తైయ్యాక.. ద‌స‌రా త‌ర్వాతే ప్ర‌స్తుత స‌చివాల‌యం కూల్చివేత ప‌నులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు వివిధ శాఖలకు సంబంధించిన ఫైల్స్ ను జాగ్రత్తగా భద్రపరిస్తున్నారు.

Tags

Next Story