ఆంధ్రప్రదేశ్

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా.. - చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు కురిపించారు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు. అన్యాయంగా టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేశారని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వం.. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు చంద్రబాబు. ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను తీవ్రంగా పరిగణిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బేషరతుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కావాలని సస్పెండ్‌ చేస్తే భయపడిపోతామని అనుకున్నారా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తామని.. తమ నోర్లను ఎవరూ నొక్కలేరన్నారు చంద్రబాబు.

రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర అంతర్జాతీయ బ్యాంకులు బ్లాక్‌లో లిస్టులో పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. వైసీపీ చేతగానితనంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వైసీపీకి.. తమకు నీతులు చెప్పే అర్హత లేదన్నారు చంద్రబాబు. బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి అమరావతిని ఇస్తే దాన్ని చంపేసే పరిస్థితికి వచ్చారన్నారు టీడీపీ అధినేత. అమరావతిలో పూర్తి రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని అన్నారు. రాజధానిని పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు చంద్రబాబు.

రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దొరకడం లేదని అన్నారు చంద్రబాబు. దీంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు 15 వందలు ఉన్న ట్రాక్టర్‌ ఇసుక.. 6 వేలకు చేరిందన్నారు. అటు తన ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్న మూడు న్యూస్‌ చానల్స్‌పై కూడా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని మండిపడ్డారు చంద్రబాబు. ఇలాంటి ధోరణి ప్రభుత్వనికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రైతులకు 12వేల 500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తామంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES