13 బౌట్లు గెలిచి.. ఆఖరి బౌట్‌లో ప్రాణాలు కోల్పోయిన బాక్సర్

ప్రపంచ బాక్సింగ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యన్ బాక్సర్ మాక్సిమ్ దదషేవ్.. రింగ్‌లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. బౌట్‌లో ఆయన తలకు బలమైన గాయాలు తగిలాయి. మెదడులో రక్త స్రావం జరిగింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది.
అమెరికాలో జరిగిన IBF ప్రపంచ టైటిల్ ఎలిమినేటర్ బౌట్‌లో మాటిస్‌తో దదషేవ్ పోటీ పడ్డాడు. 10 రౌండ్లు హోరాహోరీ తలపడ్డాడు. 11వ రౌండ్‌లో కుప్పకూలాడు. రింగ్‌లోనే రక్తపు వాంతులు అయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం కూడా కష్టంగా మారింది. స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. కోమాలోకి వెళ్లాడు. మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగినట్టు వైద్యులు చెప్తున్నారు. అత్యవసర చికిత్స అందించినా ఆ బాక్సర్‌ను బతికించలేకపోయారు. నాలుగు రోజుల తర్వాత మరణించాడు.
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి మాటిస్.. దదషేవ్‌పై ఏకంగా 319 పంచ్‌లు విసిరాడు. వాటిలో 112 మాత్రమే శరీరానికి తగిలాయి. మిగతావన్నీ అతని తలకు బలంగా తాకడంతో ప్రాణాల మీదకు వచ్చింది. తన కెరీర్‌లో మాగ్జిమ్ దదషేవ్ బరిలోకి దిగిన 14 బౌట్లలో 13 నెగ్గాడు. కానీ ఆఖరి బౌట్‌లో మాత్రం ప్రాణాలే కోల్పోయాడు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com