కుతుకులూరులో జషీత్ దొరకడంపై అనుమానాలు..

కుతుకులూరులో జషీత్ దొరకడంపై అనుమానాలు..

తల్లిదండ్రల ప్రార్థనలు.. వేలాది మంది ప్రజల దీవెనలు ఫలించాయి.. బోసి నవ్వులతో.. చిలిపి మాటలతో అల్లారుముద్దుగా కనిపించిన జషిత్‌ క్షేమంగా తిరిగి వచ్చాడు. కిడ్నాపర్ల చెర నుంచి అమ్మ ఒడికి చేరుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జషిత్‌ కిడ్నాప్‌ మిస్టరి సుఖాంతమైంది..

జషిత్‌ రాకతో నాలుగు రోజులుగా గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి నాగవల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్లీ చూడలేనేమో అని భయపడ్డ చిన్నారి.. ముద్దు ముద్దు మాటలతో అమ్మా అని పిలవగానే గుండెలో భారం అంతా ఒక్కసారిగా దిగిపోయింది. తన కొడుకు క్షేమంగా తిరిగిరావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు చెప్పింది.

ముద్దు ముద్దు మాటలు. ఆపై అల్లరి చేష్టలతో జషిత్ అందర్ని కట్టిపడేస్తున్నాడు. కిడ్నాపర్‌ల నుంచి తనను రక్షించినందుకు థ్యాంక్స్ చెబుతున్నాడు. వారు తనను బాగానే చూసుకున్నారని ఎలాంటి భయం లేకుండా మాట్లాడుతున్నాడు..

సోమవారం రాత్రి జషిత్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు.. 17 బృందాలుగా ఏర్పాడిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో కిడ్నాపర్లు భయపడినట్టు ఉన్నారు. భయంతో బాబును వదిలిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కుతుకులూరు రోడ్డు దగ్గర అర్ధరాత్రి సమయంలో జషిత్‌ను వదిలేసి పారిపోయారు. బాబును గమనించిన క్వారీ కార్మికులు తమతో తీసుకెళ్లి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలుడ్ని మండపేట తీసుకెళ్లిన ఎస్పీ నయీం అస్మి.. జషిత్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.

కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది కాని.. కిడ్నాపర్లు ఎవరు..? ఎందుకు ఎత్తుకెళ్లారు..? కాసులకోసం చేసారా..? వెంకటరమణ వ్యక్తిగత కక్షల నేపథ్యంలో చేశారా..? అన్న అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు వెనుక బెట్టింగ్ కోణం ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే 18 సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ప్రతీ అనుమానానికి ఒక్కో డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కిడ్నాపర్లు ఎవరన్నది తెలియలేదు. అయితే జషీత్ కిడ్నాపర్లలో ఒకరి పేరు రాజు అని చెబుతున్నాడు. ఈ హింట్‌తో కచ్చితంగా కిడ్నాపర్‌ను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ నయీం హష్మీ చెబుతున్నారు.

కిడ్నాప్ కేసును విచారిస్తున్న పోలీసులు బెట్టింగ్ కోణంవైపు దర్యాప్తు చేస్తుండగా మండపేట, కుతుకులూరుకు చెందిన నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకోవడం, కుతుకులూరులో జషీత్ దొరకడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ వెనుక ఉన్న కుట్రకోణం ఏంటి...? జషీత్‌ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఎవరు అనేది విచారణలో తెలియాల్సి ఉంది. మరి పోలీసులు కిడ్నాపర్లను త్వరగానే పట్టుకుంటారా.. లేక జషిత్‌ క్షేమంగా దొరికాడని.. కేసును లైట్‌గా తీసుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story