కామ్రెడ్ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.. రివ్యూ...

కామ్రెడ్ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.. రివ్యూ...

విజయ దేవరకొండ సౌత్ సినిమాకి కామ్రెడ్ అయ్యాడు. ప్రమోషన్స్‌తో సౌత్ అంతా తిరిగి తన బ్రాండ్ బలాన్ని గుర్తు చేసాడు. రష్మిక మందనతో జంటగా చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. డియర్ కామ్రెడ్ తో విజయ్ దేవరకొండ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని అందించాడు అనేది చూద్దాం..

కథ:

చైతన్య ( విజయ దేవరకొండ) కాకినాడ కాలేజ్ లో చదువుకుంటూ కాలేజ్ యూనియన్ లో చురుకుగా ఉంటాడు. తన ముందు జరిగే ఏ అన్యాయం అయినా సహించడు. ఒక రోజు అపర్ణను కాకినాడలో కలుస్తాడు. తను క్రికెటర్ అని తెలియగానే అపర్ణపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది ప్రేమగా మారిన తర్వాత చైతన్య ప్రవర్తన అపర్ణను కంగారు పెడుతుంది. కోపంలో అతను తీసుకునే నిర్ణయాలు ఆమెను ఆందోళనకు గురి చేస్తాయి. అదే వారి మద్య ప్రేమను విడదీస్తుంది. చైతన్య కూడా తనను తాను వెతుక్కుంటూ వెళతాడు. క్రికెట్ ఆమెకు జీవితం , ఆ జీవితంకు చైతన్య తోడుగా ఉంటాడనుకుంటుంది. కొన్ని పరిస్థితులు కారణంగా అపర్ణ క్రికెట్ ని వదిలేస్తుంది. మరి కామ్రెడ్ గా తోడు ఉంటాడనుకున్న చైతన్య తిరిగి ఆమె జీవితంలోకి వస్తాడా..? క్రికెట్ ప్రాణం అనుకున్న అపర్ణ ఆటకు దూరం అవడానికి కారణం ఏంటి..? వీరి ప్రేమకథ కు ఎలాంటి ముగింపు దొరికింది అనేది మిగిలిన కథ..?

కథనం:

ప్రతి ప్రేమ కథలో ఉండే మలుపులు ఈ ప్రేమకథలోకూడా కనిపిస్తాయి. ప్రేమించుకోవడం.. కారాణాలేవైనా విడిపోవడం.. మళ్ళీ కలిసిపోవడం. అయితే ఈ సాధారణ మలుపుల మద్య గొప్ప ప్రేమకథను చూపించవచ్చు అని మరోసారి నిరూపించాడు భరత్ కమ్మ. తొలి చిత్రం అయినా ఏ చిత్రాల ప్రభావం తన కథ పై పడకుండా చూసుకున్నాడు. అతని మేకింగ్ స్టైయిల్ లో ఒరిజినాలిటీ కనిపిస్తుంది. స్టూడెంట్ లైఫ్ ని చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ ప్రేమకథలో విజయ్ దేవరకొండ, రష్మిక ల మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అపర్ణ అలియాస్ లిల్లీ గా రష్మిక మదన్నా చాలా బాద్యతను తీసుకుంది. గ్లామర్ కంటే పాత్ర మీద ప్రేమ ఎక్కువగా కనిపించింది. వీరిద్దరి మద్య కెమిస్ట్రీకి విజయ్ లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం లో తారా స్థాయిలో ఉంటుంది. విజయ్ దేవరకొండ ప్రెండ్స్ గ్యాంగ్ లో కనిపించిన వాళ్ళు కూడా చాలా బాగా చేసారు. ఒకసారి హీరో పార్టీ లో ఉండగా చిన్న గొడవ జరుగుతుంది. ఆ గొడవలో రష్మిక ఎక్స్ ప్రెషన్స్ చాలా క్యారెక్టర్ ల మద్య వైరుధ్యం ఎలా డెవలప్ అవుతుందో తెలియడానికి.

అలాంటి సన్నివేశం నుండి ఆ రెండు పాత్రల మద్య ప్రేమను వైరుధ్యాలను సమపాళ్ళలో చూపించాడు దర్శకుడు. ఆ వైరుద్యం ఇంటర్వెల్ కి పతాక స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కథను మరింత అందంగా అంచనాలకు అందకుండా మలిచాడు. విడిపోయిన ప్రేమికులు కలవడానికి కలిస్తే వారి మద్య సన్నివేశాలు ఎలా ఉంటాయి. వారి మద్య గతం తాలూకు తీపి, చేదులు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి వాళ్లు పడే సంఘర్షణ ను సన్నివేశాలుగా మలచడం అంత తేలికైన పని కాదు. కానీ ఇద్దరు ప్రతిభావంతులైన ఆర్టిస్ట్ లతో భరత్ కమ్మ పని సులవైందని అనుకోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ గా ఈ కథను మలిచేందుకు అవాకాశం ఉన్నా , ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కి పూర్తిగా న్యాయం చేయగల ఇమేజ్ ఉన్న హీరో ఉన్నా కూడా దర్శకుడు తను నమ్ముకున్న దారిలోనే కథను నడిపాడు. ఎక్కడా ఇమేజ్ లను, అంచనాలను కథలోకి తీసుకురాలేదు. అందుకే విజయ్ దేవరకొండ గత చిత్రాల తాలూకు ఛాయలేవీ కనిపించకుండా చాలా కొత్త గా ఉన్నాడు.

ఇంకా చెప్పాలంటే పాత్రలో మాత్రమే ఉన్నాడు. ఫైట్స్ లో కూడా రియలిస్ట్ అప్రోచ్ తోనే వెళ్ళాడు దర్శకుడు. ఇక రష్మిక పోషించిన అపర్ణ పాత్ర చాలామంది అమ్మాయిలకు రిఫరెన్స్ గా మారుతుంది. ఇంటా, బయటా ఎదుర్కొంటున్న సమస్యలే స్పోర్ట్స్ లో కూడా కనపడితే ఆ అమ్మాయి పడే ఆవేదనకు అద్దం పట్టింది. విజయ్ దేవరకొండ, రష్మిక పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. దర్శకుడు ఆలోచనలకు ప్రాణం పోసారు. సమస్య నుండి తప్పించుకోవడం కాదు, ఎదురు నిలబడి పోరాడాలని నమ్మే కామ్రెడ్ ఇచ్చిన ధైర్యం ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చింది అనేది చాలా హృద్యంగా మలిచాడు. అధికారం అడ్డు పెట్టుకొని హుందాగా కనిపించే పెద్ద మనుషులు చీకటికోణం ఆవిష్కరించాడు దర్శకుడు.

అందుకే ఈ ప్రేమ కథ సమాజంలో జరుగుతున్న ఒక సీరియస్ ప్రాబ్లమ్ ని కూడా ఎత్తి చూపింది. విజయ్ దేరకొండ ఈ సినిమా తో నటుడిగా మరింత ఆకట్టుకున్నాడు. చైతన్య పాత్రలోని పెయిన్ ని తీసుకున్నాడు. అతని నిజాయితీని ఆవిష్కరించాడు. అతని ప్రేమను కళ్ళతో చూపెట్టాడు. ఈ సినిమాలో విజయ్ నటన ఫిదా చేస్తుంది. రష్మిక నటిగా మరో మెట్టు ఎక్కంది. జస్టిన్ మ్యూజిక్ బాగుంది. ప్రేమించిన అమ్మాయికోసం పోరాటం చేసే కామ్రెడ్ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.

చివరిగా:

డియర్ కామ్రెడ్ విజయం అందుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story