ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్న బీజేపీ

వైసీపీ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్న బీజేపీ
X

ఎన్నికల ముందు వైసీపీ నేతలను ఒక్క మాట అనని బీజేపీ ఇప్పుడు రూటు మార్చింది. మొన్నటి వరకు టీడీపీ పేరు ఎత్తితేనే భగ్గుమనే రాష్ట్ర బీజేపీ నేతలు.. ప్రస్తుతం వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్‌ సీఎంగా బాధ్యలు చేపట్టి కేవలం రెండు నెలలే అవుతున్నా.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న కన్నా లక్ష్మి నారాయణ, ఇప్పుడు పురంధేశ్వరి ఇలా కీలక నాయకులంతా వైసీపీని టార్గెట్ చేస్తూ మాటల దాడి పెంచారు.

ఏపీ ప్రభుత్వంపై దూకుడు పెంచింది బీజేపీ. వరుస ఆరోపణలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏపీలో బలోపేతమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ బీజేపీ కీలక నేతలంతా వరుసగా వైసీపీ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిని భరించలేకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోందని చెప్పారు.

గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడటం సరైంది కాదని హితవు పలికారు. రైతు సంఘాలు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. పీపీఏలలో అవినీతి జరిగితే సమీక్షించడం మంచిదేనని.. కానీ రద్దు నిర్ణయం మాత్రం సరైంది కాదన్నారు. పీపీఏలపై కేంద్రం వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కూడా వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మరో సీరియర్‌ నేత పురంధేశ్వరి సైతం ఘాటుగా విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతల తీరు చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు ఇంకాస్త పెంచాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES