అన్ని మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి - కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల కోసం కేడర్ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని సూచించారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదులో ఎక్కడా అలసత్వం చూపొద్దని హెచ్చరించారు. ప్రక్రియ సాగుతున్న తీరుపై అన్ని నియోజకవర్గాల ఇంఛార్జులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఎక్కడా బీజేపీని లైట్ తీసుకోవద్దన్నారు. బీజేపీ ఒక్క మున్సిపాల్టీలో గెలిచినా కాలర్ ఎగరేసే పరిస్థితి ఉన్నందున.. అన్ని మున్సిపాల్టీల్లో TRS జెండా ఎగరవేయాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని మున్సిపాల్టీల్లో, తాండూరు మున్సిపాల్టీలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులను హెచ్చరించారు. బీజేపీ బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో సభ్యత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
నియోజకవర్గాల వారిగా మెంబర్‌షిప్ ఇంఛార్జులతో మాట్లాడి... సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరును కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలకు సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు TRS సభ్యత్వం సుమారుగా 42 లక్షలకు చేరుకుందని... గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, పాలకుర్తి నియోజకవర్గాల్లో టార్గెట్ రీచ్ అయ్యామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదుపై మరోసారి సమావేశమై సమీక్ష నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. 70 వేలకుపైగా సభ్యత్వ నమోదుతో గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com