గిరిజనుల ఉసురు తీస్తున్న మావోయిస్టుల ల్యాండ్ మైన్లు

గిరిజనుల ఉసురు తీస్తున్న మావోయిస్టుల ల్యాండ్ మైన్లు

ఏజెన్సీ ప్రాంతం భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని.. గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. ఏ అడుగు కింద ల్యాండ్ మైన్ ఉంటుందోనని..

పోలీసులు, మావోయిస్టుల మధ్య అడవి బిడ్డలు ఆగమైపోతున్నారు. అడవిలో కాలుపెడితే ఎక్కడ బాంబు పేలుతుందో తెలియక పశువుల కాపారులు, అటవీ ఉత్పత్తుల కోసం అడవివెళ్లే గిరిజనులు వణికిపోతున్నారు. కొన్నాళ్లు జరుగుతున్న ఘటనలతో అడవిబిడ్డలు అడవివైపు కాలు వేయాలంటే ధైర్యం చాలటం లేదు. దీనికితోడు ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో ఏజెన్సీలో గిరిజనులకు మరో గండంగా మారింది.

ములుగు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 28 నుంచి వచ్చే నెల 3 వరకు వారోత్సవాలు జరుగనుండటంతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ గుత్తిగోయల గూడాల్లో తనిఖీలు నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గుత్తికోయలను ప్రతీరోజు స్టేషన్ రప్పిస్తున్నారు.

మరోవైపు పోలీసులే లక్ష్యంగా మవోయిస్టులు పాతిన ల్యాండ్ మైన్లు గిరిజనుల ఉసురు తీస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్‌ పేలి రెండు ఆవులు మృతి చెందాయి. మూడు నెలల క్రితం వాజేడు మండలం గుమ్మడిదొడ్డి సమీపంలో మేతకు వెళ్లిన ఆవు.. ల్యాండ్‌మైన్‌ ను నోట కరచుకోవడంతో.. తల భాగం నుజ్జు నుజ్జయింది. అలాగే

వెదురుబొంగుల కోసం అడవికి వెళ్లిన ఓ గిరిజనుడు ల్యాండ్ మీద కాలుపెట్టడంతో మృతిచెందాడు. దీంతో అలర్టైన మావోయిస్టులు వారోత్సవాల నేపధ్యంలో అడవి గుట్టలవైపు రావొద్దంటూ గిరిజనులను హెచ్చరించారు. పోలీసు టార్గెట్ లిస్టులో ఉన్నవారు పట్టణాలకు వెళ్లాలని సూచించారు.

మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అడవి గుట్టల్లో మందుపాతర్లు, పోలీసుల కూంబింగ్ తో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని గిరిజనుల్లో భయాందోళన నెలకొంది. అటు పోలీసులు కూడా మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్నారు.

Tags

Next Story