కర్ణాటకలో కొత్త ప్రభుత్వం.. బలపరీక్షకు సిద్ధమైన యడియూరప్ప

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం.. బలపరీక్షకు సిద్ధమైన యడియూరప్ప
X

కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైన తర్వాత వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించినా.. ఈ దిశగా ఎలాంటి అడుగులూ పడకపోవడంతో రెండు రోజులుగా సందిగ్ధం నెలకొంది. అయితే శుక్రవారం పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ యడియూరప్ప గవర్నర్‌ వాజుభాయి వాలాను కలిశారు. ఆయన విజ్ఞప్తికి గవర్నర్‌ సమ్మతించడంతో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

ఈ నెలాఖరులోగా బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 29న శాసనసభలో యడియూరప్ప తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అయితే బలాన్ని ఏవిధంగా నిరూపించుకుంటారన్న అంశం ఆసక్తిగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా.. గురువారం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 222కు పడిపోయింది. అందులో స్పీకర్‌ను తీసేస్తే ఆ సంఖ్య 221 కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 112 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా.. మరో స్వతంత్ర సభ్యుడు మద్దతు ఇస్తున్నారు. సాధారణ మెజార్టీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సంఖ్యను యడియూరప్ప ఎలా కూడగడతారనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బల నిరూపణకు గవర్నర్ వాజూభాయ్ వాలా ఏకంగా ఏడు రోజుల సమయం ఇవ్వడంపై కాంగ్రెస్‌-జేడీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడ్డాయి. రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారం గవర్నర్‌ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించాయి. ఈ చర్య సిగ్గుచేటని పార్టీ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది కాంగ్రెస్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, బీజేపీ గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది. గతంలో మాదిరిగానే అసెంబ్లీలో బలం సరిపోక యడియూరప్ప మరోసారి రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్‌ జోస్యం చెప్పింది.

బల నిరూపణ తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుంది. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై యడ్డీ సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. వారి రాజీనామాలు స్పీకర్ ఆమోదించినా లేక అనర్హత వేటు వేసినా బీజేపీకే లాభం చేకూరుతుంది. అసంతృప్త ఎమ్మెల్యేలు గైర్హాజరైనా యడియూరప్ప ప్రభుత్వం గట్టెక్కుతుంది.

Tags

Next Story