జోరుగా కురుస్తున్న వానలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి నది

తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, సీలేరు నదులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని విలీన మండలాలైన చింతూరులో 10 సెంటీ మీటర్లు, కూనవరంలో 5 సెంటీమీటర్లు, వీఆర్ పురంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటి వరకు వర్షాలు లేక సతమతమవుతున్న రైతులకు తాజాగా కురిసిన వానలతో ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు మన్యంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు మండలంలోని తిమ్మిరిగూడెం వద్ద అల్లివాగు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది. కాన్సలూరు దగ్గర సోకిలేరు వాగు పొంగడంతో గమన్లకోట, చౌలూరు, మిట్టవడ, ఏరువాడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండల కేంద్రం నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఒడిశాలో కురుస్తున్న వానలకు శబరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం శబరినది 18 అడుగులు ఉండగా.. రెండు రోజుల్లో ఎగువ కురుస్తున్న వర్షాలతో మరో ఆరు అడుగులు పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతితో స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com