మేయర్‌పై అవిశ్వాసానికి కార్పొరేటర్ల ప్లాన్‌..

మేయర్‌పై అవిశ్వాసానికి కార్పొరేటర్ల ప్లాన్‌..

ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌పై సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీ కార్పొరేటర్లకు, మేయర్‌కు మధ్య ఏర్పడిన విభేదాలు జిల్లాలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పించాల్సిందేనని అధికార పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు తీర్మానించారు. పాపాలాల్‌ను తప్పించేందుకు రహస్య ప్రాంతంలో సమావేశమైన కార్పోరేటర్లు.. మేయర్‌ వ్యవహార శైలిపై చర్చించారు.

అయితే అధిష్టానం రంగంలోకి దిగినా.. కార్పోరేటర్లలో అసంతృప్తి మాత్రం చల్లారలేదు. మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉండడంతో.. ఖమ్మం కార్పోరేషన్‌ రాజకీయం వేడెక్కింది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఎవరిని మేయర్‌ చేయాలనే అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మరోసారి సమావేశమై మేయర్‌ అభ్యర్థిపై పార్టీ సూచనల మేరకు నడుచుకోవాలని కార్పొరేటర్లు నిర్ణయించారు.

ఖమ్మం కార్పోరేషన్‌లో సంక్షోభం తారా స్థాయికి చేరడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ రంగంలోకి దిగారు. మేయర్ పాపాలాల్‌ను తొలగించాలంటున్న అసమ్మతి కార్పొరేట్లర్లతో సమావేశం అయ్యారు పువ్వాడ అజయ్‌. మేయర్‌కు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారో కారణాలు అడిగి తెలుసుకున్నారాయన. దీంతో మేయర్ పాపాలాల్ తీరును వివరిస్తూ కొందరు కార్పోరేటర్లు కంటతడి పెట్టుకున్నారు. మేయర్ పాపాలాల్‌ను తొలగించాలంటూ చేసిన తీర్మాన కాపీని ఎమ్మెల్యే అజయ్‌కు అందజేశారు.

కార్పోరేటర్ల వాదన విన్న ఎమ్మెల్యే అజయ్..పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించేది లేదని తేల్చి చెప్పారు. మేయర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు అజయ్. ఏదీ ఏమైనా పదవుల కంటే పార్టీ ముఖ్యమని..కేసీఆర్ ఏం చెబితే అలా నడుచుకుంటామని కార్పోరేటర్లకు సర్దిచెప్పారు.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అజయ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన వెంట పలువురు కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు. ఖమ్మం కార్పొరేషన్‌ను ఎస్టీ జనరల్‌కు కేటాయించగా... ఖమ్మం ఆసుపత్రి సూపరింటెండ్‌గా పనిచేస్తున్న డాక్టర్ పాపాలాల్‌ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఇప్పుడు ముగ్గురు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మాత్రమే మేయర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని.. కొందరు అవినీతిపరులైన కొర్పొరేటర్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మేయర్‌ పాపాలాల్‌ మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story