నవరత్న తైలం మాత్రమే మిగిలింది : నిమ్మల రామానాయుడు

అధికారంలోకి రాక ముందు అనేక హామీలిచ్చిన వైసీపీ... అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయిందని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లను ఏ విధంగా పంచుకోవాలని చూస్తున్నారు తప్పా.. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నవరత్నాలు పోయి.. చివరకు తలకు రాసుకునే నవరత్న తైలం మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లబ్ధి పొందాలని చూస్తున్నారని.. భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా ఇసుకను కూడా ప్యాకెట్ల రూపంలో అమ్మే అవకాశం ఉందని రామానాయుడు సెటైర్లు వేశారు. సీఎం జగన్ కనుసన్నల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్న నిమ్మల.. ప్రతిపక్షాల గొంతు నొక్కితే ప్రజల గొంతు నొక్కినట్లేనని అన్నారు.
అటు జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలవడానికి ప్రధాని మోదీనే కారణమన్న ఆయన.. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని తీవ్ర విమర్శలు చేశారు కోట్ల.
కర్నూలు జిల్లా టీడీపీ సమన్వయం కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి... వైసీపీ దాడులకు టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. వచ్చే జమిలి ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com