కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మరణం ఇప్పటికే కాంగ్రెస్‌కు షాక్‌లా ఉండగా.. ఇప్పుడు ముఖేష్‌గౌడ్ కూడా మరణించడం పట్ల అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చిన సమయంలో బలహీనంగా కనిపించారు. ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ రాజకీయాల్లో కొన్నేళ్లపాటు తనదైన మార్క్ వేసిన ముఖేష్ గౌడ్ మరణం పార్టీకి తీరని లోటని నేతలు విచారం వ్యక్తం చేశారు. మహరాజ్‌గంజ్‌, గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. స్థానికంగా మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1959 జులై 1న జన్మించిన ఆయన.. 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ముఖేష్‌కు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story