ప్రకాశం జిల్లాలో ఆరుగురు అన్నదాతలు బలవన్మరణం

ప్రకాశం జిల్లాలో ఆరుగురు అన్నదాతలు బలవన్మరణం

ప్రకాశం జిల్లాలో వరుసగా మూడేళ్ల నుంచి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుల్లో చిక్కుకున్న రైతులు.. బాకీలు తీర్చే మాార్గం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ జిల్లాను ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణాల వసూలు కోసం డిమాండ్‌ చేయకూడదు. వీలైతే రీషెడ్యూల్‌ చేయాలి. కానీ రైతులకిచ్చిన రుణాలు వసూలు చేసేందుకు బ్యాంకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. బ్యాంకుల ఒత్తిడి రైతులపై పెనుభారంగా మారుతోంది.

బ్యాంకులతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న రుణాలు కూడా రైతులకు భారంగా మారుతున్నాయి. కోర్టు నోటీసులు, బ్యాంక్‌ ఒత్తిళ్లు అన్ని కలిపి రైతుల ఉసురు తీస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో ఆరుగురు రైతులు ప్రాణాలు తీసుకున్నారు. వీళ్లంతా 20 రోజుల వ్యవధిలోనే చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికీ ఆరకొర వర్షాలతో ప్రకాశం జిల్లాలో ఖరీఫ్‌ ముందుకు సాగడంలేదు. ఇప్పటికే పెరిగిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రకాశం జిల్లాలో గత మూడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. పత్తి, శనగ, మిర్చి రైతులు ప్రతీసారి దగాపడుతూనే ఉన్నారు. ఒక వేళ అరకొర పంటలు పండినా వాటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఖరీఫ్‌లో రూ.140 కోట్లు, రబీలో రూ.106 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. ఆ పరిహారంపై ఇప్పటివరకు ఎలాంటి ఊసులేదు. ఓ వైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వ విధానాలు రైతులను నిండా ముంచుతున్నాయి. వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. తమను ఆదుకునే వారే లేరని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story