పీవీ ఘాట్ పక్కనే జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేసేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ పక్కన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారిక లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పీవీ ఘాట్ పక్కనే స్థలం కేటాయించింది.
ఇవాళ ఉదయం 9 గంటలకు జైపాల్‌రెడ్డి పార్ధివదేహాన్ని.. గాంధీభవన్‌కు తీసుకురానున్నారు. ఉదయం 12 గంటలకు వరకు ప్రజల సందర్శనార్ధం అక్కడే ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి అంతిమ యాత్ర కొనసాగనుంది..
తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా మారిన జైపాల్‌రెడ్డి మృతితో ఆ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఉత్తమ రాజకీయ నాయకుడిగా, అద్భుతమైన వక్తగా పేరున్న జైపాల్ రెడ్డికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. రాజకీయాలలో చెరగని ముద్ర వేశారంటూ ఆయన ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జైపాల్‌రెడ్డి గొప్ప మానవతా వాది అని కొనియాడారు నేతలు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
అటు జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి మోదీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప పార్లమెంటేరియన్ కోల్పోయిందన్నారు రాహుల్ గాంధీ. జైపాల్‌రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు చంద్రబాబు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల సమీపంలోని నెర్మెట్ట అనే చిన్న గ్రామంలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జైపాల్‌రెడ్డి.. తాను చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ఆయన... కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో సమాచార శాఖ, మన్మోహన్ హయాంలో పట్ణణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దక్షిణాది నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జైపాల్‌రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఢిల్లీ కేంద్రంగా క్రియాశీలక పాత్ర పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com