మరో స్వర్ణం సాధించిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ మరో స్వర్ణంతో మెరిసింది. ఇండోనేషియాలోని లాబన్ బజోలో జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్ ఫైనల్‌లో అలవోకగా విజయం సాధించింది. మహిళల 51 కేజీల విభాగం ఫైనల్‌లో ఒలింపిక్ కాంస్యపతక విజేత, ఆస్ట్రేలియా బాక్సర్ ఏప్రిల్ ఫ్రాంక్స్‌ను 5-0తో మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన కిమ్‌తో పోరాడి 3-2తో గెలిచిన మేరీ, ఫైనల్‌లో మాత్రం అలవోకగా విజయం సాధించింది.
ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్ చేస్తూ మేరికోమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్స్ కప్ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది . గెలవాడానికి ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. నా కోచ్‌లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపింది మేరీకోమ్.
36 ఏళ్ల మేరీకోమ్ బాక్సింగ్‌లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లోనూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఆసియా, కామన్‌వెల్త్ క్రీడల్లోనూ పతకాలు సాధించి సత్తా చాటింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్ 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7నుంచి 21 తేదీల్లో రష్యాలో జరగనున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2019లో మేరీకోమ్ పాల్గొననుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com