మీసేవా కేంద్రాల్లో లంచాల భాగోతం

మీసేవా కేంద్రాల్లో లంచాల భాగోతం

.మీ సేవ కేంద్రాలు.. ముడుపులకు అడ్డాలుగా మారుతున్నాయి. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు.. పారదర్శక పాలన అంటూ మంచి లక్ష్యాలతో ప్రారంభించిన ఈ మీసేవా కేంద్రాలు ఇప్పుడు దళారి వ్యవస్థలుగా మారుతున్నాయి. ఓటర్‌ ఐడీ నుంచి ఇంటికి సంబంధించి పత్రాలు, బిల్లులు ఏది కావాలన్నా సొమ్ములు చెల్లించుకుంటేనే సేవలు అందుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా.. మీసేవా కేంద్రాల్లో లంచాల బాగోతానికి అడ్డుకట్ట పడడం లేదు..

ప్రభుత్వ కార్యాలయాలు, సంబంధిత సేవల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం, ఈ-డిజిటల్‌ సీఎస్‌సీ, మీ సేవా కేంద్రాలను ప్రవేశపెట్టింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 991 సీఎస్‌సీలుండగా, ప్రస్తుతం 402 కేంద్రాల్లో సేవలు అందుతున్నాయి. అందులో 70 శాతం మీ సేవా కేంద్రాల్లోనే నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 784 మీ సేవా కేంద్రాలు ఉండగా, వాటి ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. పాస్‌పోర్టు, పట్టాదారు పాసు పుస్తకం, విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి దృవపత్రాలు అన్నింటికీ మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 61, రిజిస్ట్రేషన్‌, స్టాంపులకు సంబంధించి 14, వ్యవసాయం 36, పురపాలక 18, పోలీసు 3, ఆర్టీఏ 4, గ్రామీణాభివృద్ధి శాఖ 3, సాంఘిక సంక్షేమ శాఖ 3, విద్యశాఖ 20, దేవాదాయ శాఖ 11, విద్యుత్తు శాఖ 47, ఆధార్‌కు సబంధించి 3, తూనికలు, కొలతలు 14, భూగర్భ గనుల శాఖ 8, పరిశ్రమలు, వాణిజ్యం 16, మత్య్సశాఖకు సంబంధించి 8 సేవలు మీసేవ ద్వారానే పొందాల్సి ఉంది.

ఇన్ని ప్రభుత్వ సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. సేవలకు ప్రభుత్వం ఒక రేటు నిర్ణయిస్తే.. నిర్వాహకులు మాత్రం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం కింద నమోదు చేసుకునే రైతుల నుంచి దరఖాస్తుకు రూపాయి మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, వంద రూపాయలు తీసుకుంటున్నారు. ఒక్కో దరఖాస్తుకు 24 రూపాయలు చొప్పున మీ సేవా కేంద్రాలకు ప్రభుత్వమే చెల్లిస్తుండగా అక్కడితో సంతృప్తి చెందని నిర్వాహకులు అదనపు వసూళ్లకు అలవాటు పడ్డారు.

ఈ నెల 8న వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తరువాత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతు తన వాటా కింద రూపాయి ప్రీమియం చెల్లిస్తే చాలు. మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రీమియం చెల్లింపుల కోసం రైతులు సీఎస్‌సీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుదారుని దగ్గర సీఎస్‌సీ కేంద్రాల నిర్వాహకులు అనధికారికంగా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఈ పథకం ద్వారానే 5 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల దగ్గర ఏ సేవ కోసమైనా దరఖాస్తుకు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్న వివరాలను బోర్డులో ఉంచాలి.. నిర్వాహకులు మాత్రం చిన్న అక్షరాలతో వాటిని కంటికి కనిపించకుండా బోర్డులు పెడుతున్నారు. మీసేవా కేంద్రాల దోపీడిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. అధికారులు కేవలం హెచ్చరికలతో చేతులు దులుపుకుంటున్నారు..

Tags

Read MoreRead Less
Next Story