మిస్టరీగా మారిన కిడ్నాప్‌ కథ

మిస్టరీగా మారిన కిడ్నాప్‌ కథ

వారం క్రితం హైదరాబాద్ హయత్ నగర్ లో కిడ్నాపైన బిఫార్మసీ స్టూడెంట్ సోని ఎట్టకేలకు సేఫ్ గా ఇంటికి తిరిగొచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన రవిశేఖర్ ఆమెను, ఆమె తండ్రిని కారులో ఎక్కించుకున్నాడు. సర్టిఫికెట్ల జిరాక్స్ అంటూ మస్కా కొట్టి సోనీ తండ్రి కారు దిగేలా చేశాడు. ఆ వెంటనే సోనిని తీసుకొని పారిపోయిన రవిశేఖర్..రెండు రాష్ట్రాల్లో తిరుగుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఎట్ లాస్ట్ అతని కారుకు ఉన్న జీపీఎస్ అతన్ని పోలీసులకు పట్టించింది.

సోని తన చెరలో ఉన్నన్ని రోజులు కిడ్నాపర్ రవిశేఖర్ పెట్రోల్ బంక్ లనే అడ్డాగా మార్చుకున్నాడు. బంక్‌ల దగ్గర వాహనంలోనే బస చేసిన రవిశేఖర్‌.. చిలకలూరిపేట, కడప, తిరుపతి, ప్రకాశం, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కాలం గడిపాడు. సోమవారం నల్గొండలో 80 వేల నగదు తీసుకెళ్లిన సోనీకి డబ్బు చూపించిన రవిశేఖర్‌.. నల్గొండ నుండి నేరుగా చిలకలూరిపేటకు తీసుకెళ్లాడు. అయితే సోనీ తన ఉద్యోగ పరిస్థితి ఏంటని రవిశేఖర్‌ను నిలదీస్తున్న సమయంలో... ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఎదురుగా పోలీస్‌ వాహనాలు రావడంతో సోనీని అక్కడే వదిలేసి పరారయ్యాడు కిడ్నాపర్‌ రవిశేఖర్‌.

పోలీసుల భయంతో రవిశేఖర్ వెళ్లిపోవటంతో ఒంటరైపోయిన సోనీ..చివరికి చిలకలూరిపేట అద్దంకి హైవేపై ఎదురుగా హైదరాబాద్ బస్ రావడంతో కండక్టర్‌ను బతిమాలి బస్కెక్కింది. మంగళవారం ఉదయం మూడున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌కు చేరింది. అప్పుడే అక్కడికి ఆమె ఫ్రెండ్ రావడంతో ఆమె ఫోన్‌ నుంచే తల్లిదండ్రులకు కాల్ చేసింది.

సోనీ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు... సోనీని వెంటనే వైద్య పరీక్షల కోసం మెటర్నిటీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అసలేం జరిగిందో విచారించారు. మరోవైపు రవిశేఖర్ కారుకు అమర్చిన జీపీఎస్ ఆధారంగా నాకాబంది నిర్వహించి ఎట్టకేలకు రవిశేఖర్‌ను పట్టుకున్నారు.

ఈ కేసులో ఎన్నో అనుమానాలున్నాయి. సోనీని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు తను కిడ్నాపయిన సంగతే తనకు తెలిదని సోనీ ఎందుకు అంటోంది? చిలకలూరిపేటలో పోలీసులు వస్తున్నారని రవిశేఖర్ సోనీని వదిలేసి పారిపోయాడు. మరి అదే పోలీసులను సోనీ ఎందుకు ఆశ్రయించలేదు? రవిశేఖర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తాడనే భ్రమలోనే సోనీ ఉందా? లేక ఇంకేమైనా జరిగిందా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక రవిశేఖర్‌పై ఇప్పటికే 25కుపైగా కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడి నేర చరిత్రపైనా ఆరాతీస్తున్నారు. రవిశేఖర్‌ ను విచారిస్తే కిడ్నాప్ కేసులో ట్విస్టులకు సమాధానాలు దొరికే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story