ఆంధ్రప్రదేశ్

ఏపీలోని ఈ ప్రాంతాలను ముంచెత్తుతున్న వర్షాలు

ఏపీలోని ఈ ప్రాంతాలను ముంచెత్తుతున్న వర్షాలు
X

వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దవుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు.. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వానలు పడ్తున్నాయి. గత 5 రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. శబరి నది గోదావరి సంగమంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చింతూరు మండలం నిమ్మలగూడెం వద్ద కాజ్‌వే పై వరదనీరు చేరడంతో కుమగూరు, కల్లేరు వెళ్లే రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి.

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు తోడు, ఇంద్రావతి, సీలేరు, శబరి ఉప నదుల నుంచి వరద నీరు చేరుతుండడంతో పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పోలవరం కాఫర్ డ్యాంకు ఎగువన, దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం దగ్గర 10 మీటర్ల నీటి మట్టం నమోదైంది. వచ్చే 24 గంటట్లో ఇది 12 మీటర్లకు పెరగుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. అయితే వరదతో కాఫర్ డ్యాంకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై 11 అడుగుల మేర నీరు చేరడంతో ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, సహాయక శిబిరాలను సిద్ధం చేశామని అధికారులు చెప్పారు.

వర్షాలతో ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకుంటున్నాయి. ధవళేశ్వరం దగ్గర 3 లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, పోలవరం దగ్గర 24 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. రోడ్లు జలమయం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈ నెల 27న వరద ఉధృతికి ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో కొట్టుకుపోయిన కర్లపొదర్‌ కల్వర్ట్ ను అధికారులు తీవ్రంగా శ్రమించి మరమ్మతు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేకుండా ఎస్‌ఐ ప్రసాద రావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, గిరిజనులు శ్రమదానం చేసి, కల్వర్ట్‌తో పాటు రోడ్డును పునరుద్ధరించారు. మరో రెండ్రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడం రైతుల్లో కొత్త ఆశలు చిగురింప చేసింది.

Next Story

RELATED STORIES