కూకట్‌పల్లిలో చిరుత సంచారం

హైదరాబాద్‌లో చిరుత అలజడి రేపుతోంది. నగర శివారుల్లో చిరుత సంచారం స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. సురారం విశ్వకర్మ కాలనీలో చిరుత సంచారంతో ప్రగతినగర్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొదట ప్రగతి నగర్ మిథిలానగర్ కొండపై నిన్న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుత సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. సాయంత్రం వాకింగ్ కోసం వచ్చిన వారు చిరుతను చూసినట్లు చెబుతున్నారు. కొండపై నిల్చున్న చిరుతను జయశ్రీ అపార్ట్‌మెంట్ వాసులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
కుత్బుల్లాపూర్‌ను ఆనుకుని ఉన్న నర్సాపూర్ అడవిలోంచి చిరుతపులి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు వచ్చి.. మిథిలానగర్ కొండలపై అడుగడుగునా వెతికారు.. కానీ ప్రస్తుతం చిరుత సంచారం ఉన్నట్టు ఎలాంటి అనవాళ్లు కనిపించలేదంటున్నారు. అయినా ఎప్పుడు చిరుత అటు వస్తుందో.. ఎవరిపై ఎటాక్ చేస్తుందో అని స్థానికులు గజగజా వణుకుతున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లాలన్నా భయపడుతున్నారు.
నిన్న రాత్రి నాలుగు అడుగుల జంతువును చూసినట్టు స్థానికుల నుంచి తమకు ఫిర్యాదు వచ్చింది అంటున్నారు దూలపల్లి రేంజర్ ఫారెస్ట్ అధికారి. దీంతో ఈ పరిశరాల్లో చిరుత జాడ కోసం వెతికామని.. కాని చిరుత సంచారం ఏమి కనిపించలేదంటున్నారు అమె. అడవి పిల్లి లేదా వేరే ఏదైనా జంతువై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com