ఇరానీ గ్యాంగ్‌ చేతివాటం.. పదిన్నర తులాల బంగారం స్వాహా..

ఇరానీ గ్యాంగ్‌ చేతివాటం.. పదిన్నర తులాల బంగారం స్వాహా..
X

విశాఖలో ఇరానీ గ్యాంగ్‌ చేతివాటం ప్రదర్శించింది. గాజువాకలోని ఓ షాపింగ్‌ మాల్‌లోకి వచ్చిన ఇద్దరు యువకులు.. ఏకంగా పదిన్నర తులాల బంగారు నగదు కాజేశారు. మధ్యాహ్నం మాల్‌లోకి వచ్చిన యువకులు నేరుగా నగల విభాగంలోకి వెళ్లారు. చెవిదిద్దులు, ఉంగరాలు కావాలన్నారు. రేటు కాస్త ఎక్కువైనా పర్వాలేదంటూ బిల్డప్‌ ఇచ్చారు. సేల్స్‌మెన్‌ రెండు బాక్సులు తీసి వారు అడిగిన వస్తువులు చూపిస్తుండగా.. ఒక వ్యక్తి మెల్లిగా అందులో చేతులు పెట్టాడు. మరో వ్యక్తి అతణ్ని మాటల్లో పెట్టాడు. ఇంతలో మొదటి వ్యక్తి చాకచక్యంగా ఓ నగల పాకెట్‌ కాజేశాడు. అందులో 29 జతల చెవిదిద్దులు, ఉంగరాలున్నాయి.

కొద్ది సేపు అలా అవీ ఇవీ చూసినట్లు చేసి.. తమకు నచ్చిన డిజైన్లు లేవంటూ ఉడాయించారు. తీరా రాత్రి నగలు లెక్కించేటప్పుడు సుమారు పదిన్నర తులాల వస్తువులు తక్కువ వచ్చాయి. ఏదో జరిగిందని అనుమానం వచ్చిన సేల్స్‌మెన్‌ సీసీ ఫుటేజీలు చూడగా... ఇద్దరు వ్యక్తుల చేతివాటం కనిపించింది. మాల్‌ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది ఇరానీ గ్యాంగ్‌ పనేనని నిర్ధారించారు. వీరు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషాల్లో నేరాలు చేస్తూ పండగల సీజన్‌లో విశాఖకు వస్తుంటారని తెలిపారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Tags

Next Story