నాకు 18 మంది బిడ్డలు పుట్టిన తర్వాతే...

పెరిగిపోతున్న జనాభా ప్రపంచ దేశాలకు పెనుసవాలుగా మారుతోంది. విపరీతంగా పెరుగుతున్నజనాభాకు తట్టుకోవాలంటే మున్ముందు మరో భూగ్రహాన్ని వెతుక్కొక తప్పదని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. దీంతో జనాభాను తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆయా దేశాలు. ఓవైపు పెరుగుతున్న జనాభాను తగ్గించుకునే పనిలో ప్రభుత్వాలు ఉంటే కొందరు మాత్రం సంతానాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఇలానే జార్ఖండ్‌కు చెందిన ఓ మహిళ తనకు ఎక్కువ మంది పిల్లలు కావాలంటూ భీష్మించుకుని కుర్చుంది. 18 మంది పిల్లలను కనే వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేదే లేదని పట్టుదలతో ఉంది.
జార్ఖండ్‌కు చెందిన మహంతి దేవి దంపతులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో నివసిస్తున్నారు. వారికి ఇప్పటికే ఏడుగురు పిల్లలు. మహంతి దేవి జూలై 28న ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దానికి ఆ బాలింత చెప్పిన కారణం విని వైద్యులు ముక్కు మీద వేలేసుకున్నారు. తమ గ్రామానికి చెందిన ఓ దంపతులకు 18 మంది సంతానం ఉన్నారని, వారి కంటే ఓ బిడ్డను ఎక్కువ కనాలని ఉందని చెప్పింది. అప్పటివరకు ఆపరేషన్ చేయించుకోమని ఆ దంపతులు చెప్పారు. దీంతో వైద్యులు వారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉన్న 8 మంది పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని వివరించారు. చివరకు వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com